CBN: "విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నాదీ బాధ్యత"

ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అది తాత్కాలికమే అవుతుందని, అందులో ప్రజలు భాగస్వాములైతేనే అది శాశ్వతమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన తాళ్లపాలెంలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరి ఆరోగ్యం కోసం చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి. యూజ్ రికవరీ, రీయూజ్ విధానంతో ముందుకెళ్లాలి. వాడిన ప్లాస్టిక్ ఇస్తే డబ్బు ఇచ్చేలా చూస్తున్నాం. వ్యర్థాలను వనరుగా, ఆస్తిగా మారుస్తున్నాం. ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులకు అవార్డులు ఇస్తున్నాం. వచ్చే ఏడాది జూన్ నాటికి ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తాం. ఇప్పటికే సచివాలయంలో ప్లాస్టిక్ వాడకుండా చర్యలు చేపట్టాం. గత ప్రభుత్వం వదిలిన 86 లక్షల టన్నుల చెత్తను తొలగించాం. రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. జనవరి 26 నాటికి ఏ రోడ్డుపైనా చెత్త కనిపించకూడదు.’’ అన్నారు.
అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. అక్కడి గురుకుల పాఠశాలలో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో మాట్లాడి వివిధ అంశాలపై చర్చించారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు తనది బాధ్యత అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో శనివారం ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన పెంచేలా దీన్ని చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు తాళ్లపాలెంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కాలినడకన వెళ్లి గ్రామంలో స్వచ్ఛత పనులను పరిశీలించారు. అంతకు ముందు తాళ్లపాలెం వచ్చిన చంద్రబాబుకు తెదేపా నాయకులు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద ఆయనకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి అనిత, అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తదితరులు స్వాగతం పలికారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

