CBN: వెలిగొండకు పునాది వేసింది నేనే పూర్తి చేసేది నేనే

మార్కాపురం ప్రజల దీర్ఘకాలిక తాగునీటి, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే లక్ష్యంతో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలో తాను ప్రారంభించిన ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం తన సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. గంటవానిపల్లె సమీపంలో రూ.436 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వెలిగొండ ఫీడర్ కాలువ ఆధునికీకరణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రాజెక్టు సొరంగంలో జరుగుతున్న పనులను దృశ్య మాధ్యమం ద్వారా పరిశీలించి, ఇంజినీర్లతో మాట్లాడి పురోగతిపై సమీక్ష నిర్వహించారు.సుమారు మూడుదశాబ్దాల క్రితం మార్కాపురం ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ప్రజలు తాగునీటి కొరతపై తనకు వినతిపత్రాలు అందజేశారని సీఎం గుర్తు చేశారు. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారంగా శ్రీశైలం జలాలను ఈ ప్రాంతానికి తీసుకురావాలనే సంకల్పంతో 1996 మార్చి 5న వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించామని చెప్పారు. అయితే అనంతర కాలంలో ప్రాజెక్టు అమలులో ఆలస్యం జరిగిందని, మధ్యలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పూర్తికాని ప్రాజెక్టును 2024 మార్చిలో జాతికి అంకితం చేసినట్లు ప్రకటించడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మొత్తం రూ.9 వేల కోట్లు అవసరమవుతాయని, ఇప్పటివరకు రూ.5,455 కోట్లు ఖర్చయ్యాయని సీఎం వెల్లడించారు. గత ఐదేళ్ల పాలనలో కేవలం రూ.500 కోట్ల మేర పనులు మాత్రమే జరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లోనే రూ.540 కోట్లు వెచ్చించి పనులు వేగవంతం చేసినట్లు తెలిపారు.
తొలి దశ పూర్తి కావాలంటే....
వెలిగొండ తొలి దశ పూర్తి కావాలంటే ఇంకా రూ.2 వేల కోట్లు అవసరమని పేర్కొన్నారు. వచ్చే జూలై నాటికి ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీరు అందించడమే లక్ష్యమని ఆయన హామీ ఇచ్చారు.మార్కాపురం జిల్లాలో ఫ్లోరైడ్ స్థాయులు 2.5 నుంచి 5 పీపీఎం వరకు, కొన్ని ప్రాంతాల్లో 7 పీపీఎం వరకు నమోదవుతున్నాయని సీఎం వివరించారు. ఈ కారణంగా ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అందుకే వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే తమ ప్రాధాన్యమని అన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టును పలు మార్లు పరిశీలించారని, ప్రతి సోమవారం పురోగతి నివేదిక తీసుకుంటూ పనులను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించామని తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్టుపై కూడా దృష్టి సారించి రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాలను ఉద్యాన హబ్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇక్కడి పత్తి, మిరప, అరటి, బొప్పాయి, బత్తాయి వంటి పంటలకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మార్కాపురం బహిరంగ సభలో మాట్లాడుతూ సీఎం రాజకీయ అంశాలపై కూడా స్పందించారు. ప్రతిపక్ష నాయకుడు ప్రత్యేక హోదా ఇస్తేనే వస్తానని చెప్పడం సరికాదని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
