CBN: కాళేశ్వరం కడితే..నేను అడ్డుపడలేదు

తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సామరస్య పరిష్కారం కావాలని అన్నారు చంద్రబాబు. గోదావరి పెన్నా నదుల అనుసంధానం కావాలన్నది తన కల అని..రాబోయే రోజుల్లో అది కచ్చితంగా జరుగుతుందని చంద్రబాబు అన్నారు. కృష్ణా డెల్టా అభివృద్ధితో పాటు తెలంగాణకు కూడా నీళ్లందించామని అన్నారు సీఎం చంద్రబాబు. ఇది రాజకీయ వేదిక కాదని.. మిగతా విషయాలు తర్వాత మాట్లాడతానని అన్నారు చంద్రబాబు. గత ఏడాది కృష్ణా, గోదావరిలో వేల టీఎంసీలు సముద్రంలో కలిశాయని.. గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే తానెప్పుడూ అడ్డుపడలేదని... గోదావరిలో నీళ్లు ఉన్నాయి కాబట్టే అభ్యంతరం చెప్పలేదన్నారు. నీటి విషయంలో కానీ, సహకారంలో కానీ.. తెలుగువారు ఎప్పుడు ఐకమత్యంగా ఉండాలని అన్నారు. దేశంలో హిందీ మాట్లాడేవారికి ఎక్కువ రాష్ట్రాలుంటే.. తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు ఉండటం తెలుగుజాతికి గర్వకారణమని అన్నారు చంద్రబాబు. జ్యూయిష్ జాతి ప్రపంచంలో నంబర్ వన్ గా ఉన్నారని.. 2047 కల్లా జ్యూయిష్ జాతిని మించిపోయి తెలుగుజాతి నంబర్ వన్ గా ఉండాలన్నారు.
మాతృభాషను మర్చిపోవద్దు
మాతృభాష మన మూలాలకు సంకేతమని చంద్రబాబు అన్నారు. ఆంగ్లం అవసరమే కానీ.. మాతృభాషను మరిచిపోతే మనల్ని మనమే కోల్పోయినట్లు అవుతుందని చెప్పారు. ‘‘సంక్రాంతి కంటే ముందు వచ్చిన పండుగ ఇది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన ఎన్టీఆర్ పేరును ఈ వేదికకు పెట్టడం సంతోషదాయకం. దేశంలోనే తెలుగు భాషకు ఘనమైన చరిత్ర ఉంది. వందలాది భాషలు ఉన్నా.. మన దేశంలో కేవలం 6 భాషలకే ప్రాచీన హోదా లభించింది. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు. ప్రపంచం మొత్తంలో సుమారు 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఈ మహాసభలకు దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు ఉపయోగపడతాయి. గిడుగు వెంకట రామ్మూర్తిని తెలుగు జాతి ఎప్పటికీ మరవలేదు. నేను తెలుగువాణ్ణి.. నాది తెలుగుశం అని చాటిచెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. టెక్నాలజీతో భాషను సులువుగా కాపాడుకోవచ్చు. కొత్త యాప్లు వచ్చాయి.. తెలుగులో మాట్లాడితే అదే భాషలో సమాధానమిస్తాయి. ’’అని చంద్రబాబు అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

