CBN: యూరియా వాడకం తగ్గిస్తే ప్రోత్సహకాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. తగ్గించే ప్రతి కట్టకు రూ.800 నేరుగా రైతుకు అందిస్తామని చెప్పారు. రైతు నష్టపోకూడదు, ప్రజారోగ్యం బాగుండాలని పేర్కొన్నారు. కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. యూరియా వాడకం వల్ల పంట ఉత్పత్తుల్లో రసాయనాలు పెరిగిపోయి మన పంటలకు విదేశాల్లో డిమాండ్ తగ్గిపోతోందని చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో వ్యాఖ్యానించారు. "కొన్ని సందర్భాల్లో చైనా నుచి మిర్చి వెనక్కి వచ్చింది. అలాగే యూరప్ దేశాల్లో మన వ్యవసాయ ఉత్పత్తులుక ధరలు తగ్గిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో రసాయనాలు తగ్గించేలా పంటలు పండించాల్సి ఉంది" అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. యూరియా వాడకంపై రైతులకు చైతన్యం కల్పించాలని, అవసరమైనంత మాత్రమే యూరియాను వినియోగించాలని సూచించారు. అధిక యూరియా వాడకం దిగుబడిని పెంచుతుందనే భావన సరికాదని స్పష్టం చేశారు. యూరియాకు బదులుగా మైక్రో న్యూట్రియంట్స్‌ను సప్లిమెంట్స్‌గా వాడాలని, వచ్చే ఏడాది నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. పంజాబ్‌లో యూరియా అతివాడకం వల్ల సంభవించిన పరిణామాలను కేస్ స్టడీగా చూసి నేర్చుకోవాలని సూచించారు. రైతులకు సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంతోపాటు, ఆరోగ్య, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.
క్యాన్సర్ పంజా విసురుతోంది
‘‘యూరియా ఎక్కువ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది. దీని వాడకంపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలి. ఏపీలో క్యాన్సర్ టాప్-5 రోగాల జాబితాలో ఉంది. వాడకం ఇలాగే కొనసాగితే క్యాన్సర్‌లో నంబర్-1కి వెళ్లిపోతాం. వచ్చే ఏడాది నుంచి ఎంతవరకు అవసరమో అంతే వినియోగించాలి. మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ కింద ఇవ్వాలి. యూరియా ఎక్కువ వాడితే ఎక్కువ పంట వస్తుందనుకోవడం సరికాదు.’’ అని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రకటనతో డబుల్ ఇంజిన్ సర్కార్ లక్ష్యమైన డబుల్ డిజిట్ గ్రోత్‌ను సాధించాలని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అధిక యూరియా వాడకం పర్యావరణానికి, ఆరోగ్యానికి హానికరమని, స్థిరమైన వ్యవసాయానికి ఇది చాలా కీలకమని నొక్కి చెప్పారు. ఈ ప్రోత్సాహకాల వల్ల రైతుల ఆదాయం పెరుగుతుందని, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని తెలుస్తోంది. ‘‘నైపుణ్య గణనపై డేటా అప్డేట్ చేసి ప్రచురిస్తాం. నైపుణ్య శిక్షణ కూడా నిరంతరం కొనసాగుతుంది. యువతకు జాబ్ మేళాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మూతపడిన నైపుణ్య శిక్షణ కేంద్రాలను కూడా తెరిచాం. ప్రతి అంశాన్ని క్రియేటివ్‌గా ఆలోచించండి’’ అని కలెక్టర్లకు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com