CBN : నదుల అనుసంధానమే నా జీవిత ఆశయం

హంద్రీనీవాకు ఏపీ సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. కృష్ణా జలాలు జలహారతి ఇచ్చి రెండు మోటార్లను ఆన్ చేశారు. "2019లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చారు.. వచ్చాక నరుకుడే నరుకుడు మొదలు పెట్టారు.. హంద్రీనీవాపై ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశారా.. సినిమా సెట్టింగులు వేసి డ్రామాలు ఆడారని మండిపడ్డారు. ఇక, గట్టిగా కళ్లు మూసుకుంటే మూడేళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు అని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా సీఎం కౌంటర్ ఇచ్చారు. క్లైమోర్ మైన్సే నన్ను ఏం చేయలేదు.. జగన్ లాంటి వాళ్లు నన్ను ఏం చేయలేరు అని ధీమా వ్యక్తం చేశారు. తిట్లు, శాపనార్ధాలు నాకు తాకవు" అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
6 లక్షల ఎకరాలకు సాగునీరు
‘‘రాయలసీమ కరవు, కష్టాలు, ప్రజల బాధలు నాకు తెలుసు. నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడే పెరిగాను. అనంతపురంలో కరవు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ మాది. రాయదుర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నాం. సీమ చరిత్రను తిరగరాయాలని ఎన్టీఆర్ తొలిసారి ఆలోచించారు. హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆరే. ఆయన ఆశయాలను టీడీపీ నెరవేర్చింది. రాయలసీమకు నీరిచ్చాకే చెన్నైకి నీళ్లు ఇస్తానని ఆనాడు ఎన్టీఆర్ చెప్పారు. హంద్రీనీవా నీరు 550 కి.మీ ప్రవహించి చిత్తూరు, కుప్పం వరకు వెళ్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మల్యాల ద్వారా సుమారు 4 టీఎంసీల నీరు తీసుకెళ్లవచ్చు. కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి, పీఏబీఆర్, మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి, మదనపల్లె, చిత్తూరుకు నీరిచ్చే అవకాశం వస్తుంది. సమస్య ఎదురైతే సవాలుగా తీసుకొని పనిచేసే మనస్తత్వం నాది." అని చంద్రబాబు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com