CBN: రైతుల కళ్లల్లో ఆనందంతో నా జన్మ ధన్యమైంది

ఆంధ్రప్రదేశ్‌లో భూహక్కుల పరిరక్షణకు కీలక అడుగు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. బాపట్ల జిల్లా సూరేపల్లి గ్రామంలో నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. ఈ పాస్‌పుస్తకాలు సాధారణ పత్రాలు కాకుండా, కరెన్సీ నోట్లు తయారీకి ఉపయోగించే భద్రతా సాంకేతికతతో రూపొందించామని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. రైతుల చేతుల్లోకి ఈ పుస్తకాలు వెళ్లినప్పుడు వారి కళ్లలో కనిపించిన ఆనందం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని సీఎం తెలిపారు. భూమి రైతుకు కేవలం ఆస్తి మాత్రమే కాకుండా జీవనాధారం, గౌరవం, భద్రతకు ప్రతీక అని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో భూ వ్యవస్థలో ఏర్పడిన సమస్యలను సరిదిద్దేందుకు ప్రస్తుత ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. భూములపై వివాదాలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడిన పరిస్థితిని మార్చడమే లక్ష్యమని వివరించారు.
ఈ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని వ్యవస్థబద్ధంగా కొనసాగిస్తామని, ప్రతి నెలా 9వ తేదీన ఒక ప్రాంతంలో రైతులకు అందజేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 2027 మార్చి నాటికి మొత్తం 1.12 కోట్ల పాస్‌పుస్తకాలను అందించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే లక్షలాది పాస్‌పుస్తకాలు ఇచ్చామని, రాబోయే నెలల్లో ఈ ప్రక్రియను వేగవంతం చేస్తామని అన్నారు. పాస్‌పుస్తకాలలో క్యూఆర్ కోడ్, డిజిటల్ లాక్ వంటి సౌకర్యాలు కల్పించడం ద్వారా రికార్డులు ఎవరూ మార్చలేని విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అదేవిధంగా బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా భూ రికార్డులను శాశ్వతంగా రక్షించే వ్యవస్థను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈకేవైసీ పూర్తయిన తర్వాతే పాస్‌పుస్తకాలు ఇవ్వడం ద్వారా పారదర్శకతను పెంచుతున్నామని చెప్పారు
రాష్ట్ర అభివృద్ధి అంశాలపై మాట్లాడుతూ, సూర్యలంక బీచ్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి గోవా తరహాలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు. దీంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే మత్స్యకారుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, వారి జీవనోపాధికి ఎలాంటి భంగం కలిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. రాజకీయ అంశాలపై కూడా స్పందించిన సీఎం, గత పాలనలో జరిగిన తప్పిదాల వల్ల వ్యవస్థలు దెబ్బతిన్నాయని విమర్శించారు. అమరావతి అభివృద్ధి విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, దాన్ని దేశంలోనే ప్రముఖ రాజధానిగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మొత్తం మీద ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఆస్తుల కోసం తల్లీ చెల్లిని రోడ్డుకీడ్చిన వ్యక్తిని ఎవ్వరూ ఆదర్శంగా తీసుకోవద్దని సీఎం చంద్రబాబు సూచించారు. బాబాయ్ ను చంపి ఆ నేరం తనపై వేశాడని దుయ్యబట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
