CBN: ఎవరెన్ని కుట్రలు చేసినా... అమరావతి అభివృద్ధిని ఆపలేరు

2024 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర అనిశ్చితి, భయభ్రాంతుల మధ్య గడిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అప్పట్లో ప్రజలు మాట్లాడాలన్నా, నవ్వాలన్నా కూడా భయపడే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పాలనలో వచ్చిన మార్పులు, అభివృద్ధి ప్రణాళికలపై విస్తృతంగా మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 18 నెలల వ్యవధిలోనే రాష్ట్రానికి సుమారు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు వెల్లడించారు. దేశవ్యాప్తంగా వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) 25 శాతం వాటా ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే దక్కిందని చెప్పారు. ఇది కేవలం సంఖ్యల విషయం మాత్రమే కాదని, రాష్ట్రంలో సుపరిపాలన, పారదర్శకత, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం ఏర్పడిందనే దానికి స్పష్టమైన నిదర్శనమని వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారులు నమ్మకంతో ముందుకు వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.రాజధాని అంశంపై కూడా సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి శాశ్వతంగా కొనసాగుతుందని, ప్రపంచం మెచ్చే స్థాయిలో అమరావతిని అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంతటి కుయుక్తులు పన్నినా అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ సూత్రంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
గత ఐదేళ్ల పాలనను ప్రస్తావిస్తూ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఆ కాలంలో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిందని, తనలాంటి వారినే జైలుకు పంపిన పరిస్థితులు చూశామని చెప్పారు. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచారని ఆరోపించారు. అయితే ప్రజలు ఈ పరిస్థితులను గమనించి, ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. 94 శాతం మంది అభ్యర్థులను గెలిపించడం ద్వారా ప్రజలు మార్పు కోరుకున్నారని, సమర్థ నాయకత్వానికి మద్దతుగా నిలిచారని చంద్రబాబు అన్నారు. సమర్థ నాయకత్వం ఉంటేనే ప్రజల జీవితాల్లో పెనుమార్పులు సాధ్యమవుతాయని సీఎం పేర్కొన్నారు. చెడు చేసినవారిని ప్రజలు గుర్తుపెట్టుకుని తగిన బుద్ధి చెబుతారని, మంచి చేసే ప్రభుత్వాలను మాత్రం ప్రోత్సహిస్తారని అన్నారు. ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నానని చెప్పారు. ముఖ్యంగా కరెంట్ ఛార్జీలు పెంచబోమని ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ, ఆ మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలు ఖర్చులను తగ్గించే చర్యలు తీసుకుంటూ, ప్రజలపై భారం పడకుండా చూస్తున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘సూపర్ సిక్స్’ పథకాలు ప్రజల్లో మంచి స్పందన పొందాయని చంద్రబాబు తెలిపారు. ఈ పథకాలను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, అమల్లో సూపర్ హిట్‌గా మార్చామని అన్నారు. గతంలో చెడు ఆలోచనలతో, నేరపూరిత ధోరణితో రాజకీయాలు చేసి రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టారని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
