CBN: "అవతార్" కంటే రామాయణం, మహా భారతం గొప్పవి

భారత సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచంలోనే అరుదైన, గొప్ప విషయాలని.. అవతార్ సినిమా కంటే భారతం, రామాయణం గొప్పవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. హాలీవుడ్ సూపర్ స్టార్లు, బ్యాట్మన్, అవెంజర్స్ కంటే అర్జునుడు గొప్ప యోధుడు అని పిల్లలకు మనం చెప్పాలని సూచించారు. వేల ఏళ్ల కిందటే ప్రపంచానికి ఆయుర్వేద వైద్యంతో పాటు అర్బన్ టౌన్ ప్లానింగ్ నేర్పించిన ఘనత భారత్‌కు దక్కుతుందన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ దేశాభివృద్ధి కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేస్తున్న కృషిని కొనియాడారు. అవతార్ సినిమా కంటే భారతం, రామాయణాలు గొప్పవని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు చెప్పారు. ఎవరు మంచివాళ్లో.. ఎవరు చెడ్డవాళ్లో వివరించాలని సూచించారు. దీనివల్ల పిల్లలకు మంచి, చెడుల మధ్య వ్యత్యాసాలు తెలుస్తాయన్నారు. ప్రజలు పురాణాల గురించి మరిచిపోయే సమయంలో ఎన్టీఆర్ ఎన్నో పురాణగాథలతో కూడిన సినిమాలు చేశారని గుర్తుచేశారు. వాటి ద్వారా చైతన్యం తెచ్చిన గొప్ప నాయకుడు ఆయన అని కొనియాడారు. రాజకీయాల్లోనూ అదే స్థాయిలో విలువలు పాటించారన్నారు.
దేశాభివృద్ధికి మాజీ ప్రధాని వాజ్‌పేయీ గతంలో పునాదులు వేశారని.. ఇప్పుడు ప్రధాని మోదీ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. వినూత్న ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు చేపట్టాలన్నారు. భవిష్యత్తులో మనదేశం సూపర్ పవర్ కాబోతోందని చెప్పారు.
"దేశాభివృద్ధి విషయంలో భారత అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. మాజీ ప్రధాని వాజ్ పేయి అభివృద్ధికి గట్టి పునాదులు వేయగా, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వేగంగా దూసుకుపోతోంది. యువత వినూత్న ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు చేపట్టాలని, తద్వారా భారతదేశం భవిష్యత్తులో ప్రపంచ దేశాలన్నింటికీ నాయకత్వం వహించే సూపర్ పవర్‌గా మారుతుంది. . సమాజం పురాణాలను మర్చిపోతున్న తరుణంలో నందమూరి తారక రామారావు తన సినిమాల ద్వారా ఆ పురాణ గాథలను ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లారు. కేవలం సినిమాల్లోనే కాకుండా, రాజకీయాల్లో కూడా విలువలను పాటిస్తూ ప్రజల్లో గొప్ప చైతన్యాన్ని తీసుకువచ్చిన మహానేత ఎన్టీఆర్. మన మూలాలను గౌరవిస్తూనే, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగడమే నేటి తరానికి అవసరమని’ చంద్రబాబు పిలుపునిచ్చారు.
భారత్ ఓ విజ్ఞాన భాండగారం
మన దేశ విశిష్టతను, భారతీయతను చర్చించుకోవడానికి భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ఒక అద్భుతమైన వేదికగా అభిప్రాయపడ్డారు. ప్రాచీన కాలం నుండే భారతదేశం విజ్ఞాన భాండాగారంగా విరాజిల్లిందని, వేల ఏళ్ల క్రితమే హరప్పా నాగరికత ద్వారా మన పూర్వీకులు అద్భుతమైన అర్బన్ ప్లానింగ్‌ను ప్రపంచానికి చాటిచెప్పారని గుర్తుచేశారు. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద గురించి వివరిస్తూ, సుమారు 2900 ఏళ్ల క్రితమే భారతీయులు యోగాభ్యాసాన్ని ప్రారంభించారు. వివిధ రంగాల్లో భారతదేశం సాధించిన నైపుణ్యాన్ని వివరిస్తూ ఆస్ట్రానమీలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు వంటి మహానుభావుల సేవలను చంద్రబాబు స్మరించుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

