CBN: రైతుల సమస్యలు పరిష్కరించండి

రాజధాని అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రాజధాని రైతులకు అండగా నిలవాలని, వారికి పూర్తి న్యాయం జరగాలని స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో సీఆర్డీఏ కార్యకలాపాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు గత ప్రభుత్వ కాలంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని సీఎం పేర్కొన్నారు. వారి సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని తక్షణ పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు. రైతులు చేసిన త్యాగం వృథా కావొద్దు అని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.. వారికి ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణ న్యాయం చేయాలి అని స్పష్టం చేశారు."గత ఐదేళ్లలో రాజధాని రైతులు సుదీర్ఘ పోరాటం చేశారు. వారికి ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలి" అని పురపాలక, సీఆర్డీఏ శాఖలను ఆదేశించారు. రైతుల ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు త్వరలోనే వారితో సమావేశం కావాలని పురపాలక శాఖ మంత్రి నారాయణకు, ఉన్నతాధికారులకు సూచించారు. ప్రభుత్వం కోసం త్యాగాలు చేసిన రైతులకు అదే స్థాయిలో సహకారం అందించడం మన బాధ్యత అని అన్నారు. ఇంకా ఏమైనా అపరిష్కృత అంశాలు మిగిలి ఉంటే, వాటిని కేబినెట్ సమావేశం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.
త్వరలో రైతులతో భేటీ
రైతులు ఎదుర్కొంటున్న సాంకేతిక మరియు పరిపాలనా ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు త్వరలో వారితో సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ మరియు అధికారులకు సీఎం ఆదేశించారు. అమరావతి నగర నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. వేగం, నాణ్యత, ప్లానింగ్.. ఈ మూడు అంశాలలో రాజీ లేకుండా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

