CBN: మూడేళ్లలో 17 లక్షల ఇళ్లే లక్ష్యం

రాష్ట్రంలో ఇటీవలే 3లక్షలకు పైగా పేదల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి సామూహిక గృహ ప్రవేశాలు చేయించిన సీఎం చంద్రబాబు, రానున్న మూడేళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ లక్ష్య సాధన కోసం తగిన కార్యాచరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. లక్ష్యానికి అనుగుణంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తూ.. ఇకపై ప్రతి 3నెలలకొకసారి సామూహిక గృహప్రవేశాలు చేయించాలని స్పష్టంచేశారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో గృహ నిర్మాణశాఖ, టిడ్కో అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ‘అందరికీ ఇళ్లు(హౌసింగ్ ఫర్ ఆల్) కట్టిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ఈ హామీని నెరవేర్చే ప్రక్రియలో ఇప్పటికే 3లక్షలకు పైగా ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు చేయించాం. ‘హౌసింగ్ ఫర్ ఆల్’ కార్యక్రమాన్ని 2029 జనవరి నాటికి పూర్తిచేయాలి. ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగుల వరకు అందరూ బాధ్యతగా తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు 20 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మిగిలిన 17లక్షల ఇళ్లను వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలి. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు జరగాలి. త్వరలో టిడ్కో, హౌసింగ్ ఉన్నతాధికారులు, ఉద్యోగులందరితో సమీక్ష చేస్తాను’ అని తెలిపారు. ‘ప్రభుత్వం నెరవేర్చాల్సిన హామీ హౌసింగ్ ఫర్ ఆల్. ఈ కార్యక్రమం అమలులో పొరపాట్లూ జరగకూడదు.. జాప్యం చేయకూడదు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించే విధంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా చూడాలి’ అని సూచించారు. . ‘అర్హులందరికీ ఇళ్ల నిర్మాణం చేపడతామని ఎన్నికల్లో హామీనిచ్చాం. 20 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాం. 2029 జనవరి నాటికి మిగతా లక్ష్యాన్ని వేగంగా పూర్తిచేయాలి’ అని సూచించారు.
ముస్లింలకు అదనంగా రూ.50 వేలు
‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-1.0 పథకం కింద నిర్మాణం చేపట్టే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీటీజీలకు అదనంగా ఆర్థికసాయం అందిస్తున్నాం. ఇప్పుడు ముస్లింలకూ రూ.50వేలు అదనంగా ఇవ్వాలని నిర్ణయించాం. దీనికోసం 18వేల మందికి రూ.90 కోట్లు అవసరమవుతాయి. ప్రభుత్వం ఆయా వర్గాలకు అదనంగా ఇస్తున్న సాయాన్ని వారికి వివరించాలి. అర్హులంతా సద్వినియోగం చేసుకునేలా చూడాలి’ అని వివరించారు.
వేగంగా లబ్ధిదారుల ఎంపిక సర్వే
‘ఇళ్ల నిర్మాణ పనుల్లో పొరపాట్లకు, జాప్యానికి తావివ్వరాదు. అర్హుల ఎంపికకు సర్వే త్వరగా పూర్తిచేయాలి. వారి జాబితాను గ్రామాలవారీగా ప్రదర్శించాలి. ప్రజలు సంతృప్తి చెందితేనే నాకు సంతృప్తి. ఇంటి నిర్మాణానికి స్థలం లేనివారికి స్థలం కేటాయించాలి. తమకు స్థలాలు ఉన్నాయని, అందులో నిర్మించుకుంటామని చెబితే పొసెషన్ సర్టిఫికెట్లు అందించాలి. ఇళ్ల నిర్మాణాలపై అప్డేట్లన్నీ ఆన్లైన్లో ఉండేలా చూడాలి’ అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కక్షసాధింపులో భాగంగా 2014-19 మధ్య చేపట్టిన ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీంకు సంబంధించిన కొందరు లబ్ధిదారులకు బిల్లులు నిలిపివేసిందని సీఎం చెప్పా రు. రూ.920 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో పడ్డాయన్నారు. . వీటిని తిరిగి రప్పించేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. వాటిని గత ప్రభుత్వం ఏవిధంగా అడ్డుకుందో వివరించాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

