CBN: పేదలకు నాణ్యమైన వైద్యాన్ని తప్పక అందిస్తాం

స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధన కోసం రూపొందించిన పది సూత్రాల్ని పది మిషన్లుగా నిర్దేశించుకుని అన్ని శాఖలూ పని చేయాలని, వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. పేదరికం లేని సమాజం అనే మిషన్‌లో భాగంగా ప్రతి కుటుంబానికి సాధికారత, వ్యక్తులకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు. బుధవారం ఆయన సచివాలయంలో స్వర్ణాంధ్ర లక్ష్యాలు, పది సూత్రాల అమలుపై అధికారులతో సమీక్షించారు. ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్‌లో భాగంగా పౌరులకు వేగంగా, మెరుగైన సేవలు అందించాలి. ప్రతి ప్రభుత్వ శాఖ సూచికలు సిద్ధం చేసుకుని పనిచేయాలి. వాటి అమలును విజన్ యూనిట్ల ద్వారా పర్యవేక్షించాలి. జనాభా నిర్వహణకు విధానం రూపొందించాలి. సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో 30 లక్షల పేద (బీపీఎల్) కుటుంబాలకు ఎంత ప్రయోజనం కలిగిందో అంచనా వేయాలి. నైపుణ్యాలు, ఉద్యోగ కల్పనను అత్యంత ప్రాధాన్యాంశంగా తీసుకోవాలి. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలి. నైపుణ్యం పోర్టల్ ద్వారా వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచాలి’ అని చంద్రబాబు ఆదేశించారు.
పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్యను అందించే విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానం అమల్లో ఉందని.. దీని విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు.. నిర్దేశించిన పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనిపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో సీఎం బుధవారం సమీక్షించారు. పీపీపీ విధానంలో చేపట్టిన వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) సహా ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ విధానంలో ఆసుపత్రులు, వైద్య కళాశాలల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై కేంద్ర ప్రభుత్వ సూచనలు, మార్గదర్శకాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. సామాజిక- ఆరోగ్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ పీపీపీ ప్రాజెక్టులకు మద్దతివ్వాలన్న ఉద్దేశంతో వీజీఎఫ్ కింద అందించే 60 శాతం ఆర్థిక చేయూతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి 30% చొప్పున భరించాలని కేంద్రం సూచించిందని చెప్పారు. వీజీఎఫ్ ద్వారా అరుణాచల్‌ప్రదేశ్, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఆసుపత్రులు, వైద్య కళాశాలలు నిర్మించేందుకు ఆర్థిక వ్యవహారాల విభాగం ఇప్పటికే అనుమతులు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం పీపీపీ విధానాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ప్రభుత్వం తొలి విడతగా ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల వైద్య కళాశాలలకు ఆహ్వానించిన టెండర్ల తాజా పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
నగర నిర్మాణంలో సోల్:లోకేశ్
ఆధునిక నగరాల రూపకల్పనపై మంత్రి నారా లోకేశ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఎక్స్ వేదికగా చర్చనీయాంశంగా మారింది. లింక్డ్ఇన్లో వచ్చిన ఒక విశ్లేషణాత్మక పోస్టును ప్రస్తావించిన ఆయన, నగరాల అభివృద్ధి భావోద్వేగాల ప్రదర్శనగా కాకుండా స్పష్టత, క్రమశిక్షణ, కార్యాచరణాత్మక ప్రణాళికలపై ఆధారపడాలని అభిప్రాయపడ్డారు. నగర నిర్మాణంలో ‘సోల్’ అనే పేరుతో అధిక నాటకీయతకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరం లేదని, బదులుగా సమర్థవంతమైన ప్రణాళిక, సమయపాలన, పని చేసే వ్యవస్థలే అసలైన బలమని ఆయన పేర్కొన్నారు. మౌలిక వసతులు నమ్మకంగా పనిచేసే విధంగా ఉండాలి, నియమాలు స్పష్టంగా ఉండాలి, అప్పుడు మాత్రమే ప్రజలు ఆటంకాలు లేకుండా జీవించేందుకు, ఆశయాలను సాధించేందుకు స్వేచ్ఛ లభిస్తుందని ఆయన ట్వీట్లో తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

