CBN: సమాజంలో అలజడి సృష్టిస్తే ఎవరైనా వదలం

పోలీసు యంత్రాంగానికి మూడో కన్నులా సీసీ కెమెరాలు పనిచేస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి 55 కి.మీలకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టెక్నాలజీ సాయంతో ఎవరు, ఎక్కడ, ఏ తప్పు చేసినా ఆధారాలతో పట్టుకునే పరిస్థితి రావాలన్నారు. ఈగల్, శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందని వారి సేవల్ని సీఎం చంద్రబాబు కొనియాడారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలను పసిగట్టాలని పోలీసులకు చంద్రబాబు సూచించారు. అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో నేరాలు చేసే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు హితవు పలికారు. పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన అంశంతో మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూశారన్నారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి వేరే వాళ్లపై నెపం వేసి రాజకీయ లబ్దిపొందాలని చూశారన్నారు. పోలీస్ వ్యవస్థ సమర్థంగా ఉండాలని.. నేరస్తులు భయపడేలా పని చేయాలని వారికి సీఎం సూచించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గూగుల్ పెట్టుబడులు విశాఖపట్నంకు వచ్చాయంటే.. అది ఒక నమ్మకమన్నారు. అతిపెద్ద పెట్టుబడులు వస్తున్నాయంటే పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నామని ఆయన వివరించారు.
పోలీసులకు చంద్రబాబు వరాలు
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులర్పించారు. పోలీసుల సేవలను కొనియాడుతూ, వారికి పలు వరాలు ప్రకటించారు. అలాగే వైద్య సేవలు, బీమా, డీఏ, సరెండర్ లీవ్ చెల్లింపు వంటి అంశాలను ప్రస్తావించారు. శాంతి భద్రతల పరిరక్షణకు, సాంకేతికతను ఉపయోగించుకోవాలని పోలీసులకు సూచించారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదన్నారు. ఈ ఏడాది విధినిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న పోలీసులు అంటే తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందన్నారు. పోలీసులకు కొన్ని వరాలు ప్రకటించారు. పోలీసులు చేసేది కేవలం ఉద్యోగం కాదు.. వారు చేసేది నిస్వార్థ సేవ అన్నారు. వైద్యసేవలకు పోలీసులకు 16 నెలల్లో రూ.33 కోట్లు విడుదల చేశామని.. మరణించిన 171 మంది పోలీసులకు బీమా కింద రూ.23 కోట్లు అందించామన్నారు. అలాగే పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. పోలీసులకు ఒక సరెండర్ లీవ్ డబ్బును రెండు విడతల్లో చెల్లిస్తున్నామన్నారు. 6,100 కానిస్టేబుల్ నియామకాలను పూర్తి చేశామని.. శాఖాపరమైన పదోన్నతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com