CBN: రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తే సహించను

వైసీపీ నేతల జంతు బలులపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి హింసాత్మక చర్యలకు ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రౌడీయిజం, భయభ్రాంతులకు పాల్పడే చర్యలను సహించబోనని హెచ్చరించారు. చంద్రబాబు మాట్లాడుతూ, అధికార మదంతో కొంతమంది నేతలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ జంతు బలుల పేరిట అమానుష చర్యలకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమన్నారు. సమాజాన్ని వెనక్కి నెట్టే ఈ తరహా చర్యలు రాష్ట్ర ప్రతిష్ఠను దిగజారుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆధునిక సమాజంలో విజ్ఞానం, తర్కం, చట్టపాలన ఉండాల్సిన చోట హింసాత్మక ఘటనలను ప్రోత్సహించడం ప్రజలకు తప్పు సంకేతాలను ఇస్తుందన్నారు. అధికారంలో ఉన్నవారు చట్టాన్ని గౌరవించకుండా ప్రవర్తిస్తే, సాధారణ ప్రజల్లో చట్టంపై నమ్మకం ఎలా నిలుస్తుందన్న ప్రశ్నను ఆయన లేవనెత్తారు.
పోలీసులూ అప్రమత్తంగా ఉండండి
హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి తిరుపతిలో నూతన పోలీసు కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు శుక్రవారం ప్రారంభించారు. గౌరవవందనం స్వీకరించి సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాన్ని రాసిన తర్వాత పోలీసులను ఉద్దేశించి మాట్లాడారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన కార్యక్రమాల వల్ల ప్రజల్లో ఇప్పటికీ అశాంతి ఉంది. వైసీపీ శ్రేణులు ఇంకా రౌడీయిజం చేయాలని ఆలోచిస్తున్నాయి. పోస్టర్లు పెట్టి వారి నాయకుడి పుట్టినరోజు చేసుకోవచ్చు. అ చట్టపరిధిలో ఎలాంటి కార్యక్రమాలు చేసుకున్నా అభ్యంతరం లేదని, రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తామంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ‘వైసీపీ హయాంలో 2019-24 మధ్య చాలా సమస్యలు తలెత్తాయి. తిరుమలనూ అపవిత్రం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. వేంకటేశ్వరస్వామి విషయంలో ఎవరైనా తప్పు చేస్తే ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారు. తిరుపతి, తిరుమలలో ఏ చిన్న అలజడి చోటుచేసుకున్నా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తిరుపతిని నేరాలు లేని ప్రశాంతనగరంగా తీర్చిదిద్దాలి. పది రోజులపాటు జరిగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉంటున్నందున పోలీసులు, తితిదే అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎక్కడ చిన్న ఇబ్బంది తలెత్తినా కఠిన చర్యలు తీసుకుంటా. సాంకేతికత వినియోగించి రౌడీషీటర్లపై నిఘా ఉంచండి. ఇన్విజిబుల్ పోలీసు, విజిబుల్ పోలీసింగ్ ఉండాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
టీడీపీ నేతలను కూడా జైలుకు పంపా...
‘రాయలసీమలో ముఠాకక్షలు అణచివేశా. టీడీపీ నాయకుల ప్రమేయం ఉంటే వారినీ జైళ్లకు పంపా. రౌడీలను రాష్ట్ర బహిష్కరణ చేశానని గుర్తుంచుకోండి. దొంగతనం, నేరాలు చేసే వ్యక్తులు పట్టుబడతారని గుర్తుంచుకోవాలి. నేరస్థుల కంటే పోలీసులు సమర్థంగా వ్యవహరించాలి. అప్పుడే వారికి అడ్డుకట్ట పడుతుంది. గుంటూరులో వారి వాహనం కిందే ఒక మనిషిని తొక్కి.. అంబులెన్స్‌లో తీసుకెళ్లి పోలీసులే చంపేశారని మృతుడి కుటుంబసభ్యులతో చెప్పించారు. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇది అసమర్థ ప్రభుత్వమని చెబితే ఊరుకోం. సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ వైకాపా శ్రేణులు నీచంగా, అసభ్యంగా పోస్టులు పెడుతున్నాయి. హత్యలు, అసాంఘిక కార్యక్రమాలు చేస్తే వదిలిపెట్టవద్దని పోలీసులకు స్పష్టంగా చెప్పా. అలాంటి నాయకులను నేను ప్రోత్సహించను’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘కూటమి వచ్చాక దేవాలయాల్లో దొంగతనాలు, దాడులు తగ్గాయి. పోలీసులు గట్టిగా ఉన్నారని తెలిస్తే నేరస్తులు దారిలోకి వస్తారు. నోరు పారేసుకుంటాం.. ఇష్టారాజ్యంగా ఉంటాం.. రౌడీయిజం చేస్తామంటే ప్రభుత్వం గట్టిగా ఉంటుంది. నేనూ తిరుపతిలోనే పుట్టి పెరిగా. ప్రతి వీధీ, సందూ తెలుసు’ అని హెచ్చరించారు. నో హెల్మెట్- నో పెట్రోల్ కార్యక్రమం అభినందనీయం. తుడా సహకారంతో నూతన పోలీసు కార్యాలయంలో పచ్చదనం పెంపొందిస్తున్న కలెక్టర్, ఎస్పీలకు ప్రశంసలు’ అని చంద్రబాబు అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

