CDAP: యువత కలలను నిజం చేస్తున్న "సీడాప్"

“విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగం చేయాలి” అనే లక్ష్యంతో ప్రయాణం ప్రారంభించిన గ్రామీణ యువత, ఇప్పుడు ఆ కలను నిజం చేసుకుంటున్నారు. సీడాప్ సంస్థ ద్వారా ఉచితంగా జర్మన్ భాషా శిక్షణ పొంది, పలువురు యువతీయువకులు జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు పొందారు. రూపాయి ఖర్చు లేకుండా భాషా శిక్షణ, వసతి, ఆహారం కల్పించడం వల్ల తాము ఈ అవకాశాన్ని అందుకున్నామని తెలిపారు. సీడాప్ శిక్షణతోజర్మనీలో ఉద్యోగాలు పొందిన యువతను ఉండవల్లి నివాసంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ అభినందించారు. సీడాప్ ద్వారా 5 ఏళ్లలో 50 వేల మందికి విదేశీ ఉద్యోగాలు లక్ష్యంగా పని చేస్తున్నామని ఈ సందర్భంగా లోకేశ్ తెలిపారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు సీడాప్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు.. ఇకపై చదువుతోపాటే విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
జర్మనీలో ఉద్యోగాలు
సొసైటీ ఫర్ ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ & ఎంటర్ ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్, ఇండో యూరో సింక్రనైజేషన్ & జర్మన్ హెల్త్ కేర్ సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్లేస్ మెంట్ పథకం (నర్సింగ్ ప్రొఫెషనల్స్) కింద 14మంది నర్సింగ్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి జర్మనీలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు కల్పిస్తూ కాల్ లెటర్స్ అందాయని తెలిపారు. తొలిబ్యాచ్ లో సీడాప్ ద్వారా మొత్తం 171 మందికి శిక్షణ ఇవ్వగా, ఇప్పటికే వివిధ విభాగాల్లో 40 మంది ఎంపికయ్యారని, వారిలో 14 మంది త్వరలోనే జర్మనీ వెళ్తున్నారని పేర్కొన్నారు. మిగిలిన అభ్యర్థులు కూడా వివిధ దశల్లో శిక్షణ పూర్తి చేస్తున్నారని, వారికి త్వరలోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మన రాష్ట్రంలోని బిడ్డలకు అంతర్జాతీయస్థాయి ఉద్యోగాల కల్పించాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం అని. ఆ లక్ష్యానికి అనుగుణంగా సీడాప్- ఓంక్యాప్ లను బలోపేతం చేస్తున్నామని లోకేశ్ వెల్లడించారు.
రూ.2.8లక్షల ఉద్యోగం కలగా ఉంది..
బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేసి, స్థానిక ఆసుపత్రుల్లో నెలకు రూ.15 వేల నుంచి రూ.20వేలకు పని చేసే తమకు జర్మనీలో రూ.2.8లక్షల వేతనంతో ఉద్యోగం లభించడం కలగా ఉందని పేర్కొంటూ అభ్యర్థులు భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యోగాలు సాధించిన 14మందిలో 9మంది నిరుపేద ఎస్సీ కుటుంబాలకు చెందిన వారు.. ముగ్గురు బీసీలు ఉన్నారు. జర్మనీలో ఇవే ఉద్యోగాల కోసం కన్సల్టెన్సీలను శిక్షణ కోసం సంప్రదిస్తే రూ.8 లక్షల వరకు అడిగారని, అంత డబ్బు చెల్లించే ఆర్థిక స్తోమత తమకు లేదని పేర్కొన్నారు. సీడాప్ ద్వారా ఒక్క రూపాయి తీసుకోకుండా జర్మన్ భాషలో శిక్షణ ఇచ్చి, ఉద్యోగం వచ్చేలా చేశారని తెలిపారు. తమ కలను సాకారం చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. ఈ కార్యక్రమంలో సీడాప్ ఛైర్మన్ దీపక్‌రెడ్డి, సీఈఓ నారాయణస్వామి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ గణేష్‌కుమార్ పాల్గొన్నారు.
విదేశీ భాషలపై శిక్షణ
చదువు పూర్తయ్యాక కాకుండా చదువులో భాగంగానే జర్మన్, జపనీస్ లాంటి విదేశీ భాషలపై శిక్షణ ఇస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. యువత అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలు సాధించాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని, అందుకు అనుగుణంగా వారికి శిక్షణ అందుతోందన్నారు. అంతర్జాతీయ స్థాయి అవకాశాలను మన విద్యార్థులు అందిపుచ్చుకునేలా సీడాప్, ఓంక్యాప్ సంస్థల ద్వారా విదేశీ భాషలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈనెలలోనే నైపుణ్యం పోర్టల్‌ను ప్రారంభిస్తామని లోకేశ్ తెలిపారు.
నిరుద్యోగులను మోసం చేసిన జగన్
‘వైసీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా దెబ్బతీసింది. అందుకు కేంద్రం విడుదల చేసిన అసర్ నివేదికే సాక్ష్యం. వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది అనడానికి అసర్ నివేదిక ఒక ఉదాహరణ’అని సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి అన్నారు. ‘దేశం మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మూడో తరగతి చిన్నారుల్లో రెండోతరగతి పాఠ్యపుస్తకాలనైనా తడబడకుండా చదివే సామర్థ్యం 2022లో 16.3% ఉండగా...2024 నాటికి 23.4%కి చేరింది. అందుకు భిన్నంగా మన రాష్ట్రంలో మూడో తరగతిలో ఉండి రెండో తరగతి పుస్తకాలు చదవడం వచ్చిన విద్యార్థులు 2018లో 22.6 శాతం ఉంటే 2024లో 14.7 శాతానికి తగ్గారు. ఇది జగన్ రెడ్డి పాలన డొల్లతనం. కేంద్రం విడుదల చేసిన అసర్ నివేదిక ఈ విషయాలను చెప్పింది.రాష్ట్రంలో ఐదో తరగతి చదువుతూ రెండో తరగతి పుస్తకాలు చదవడం వచ్చిన వాళ్లు 2018లో 57.1 శాతం ఉండగా 2024లో 37.5 శాతానికి తగ్గారని అసర్ నివేదిక వెల్లడించింది’అని సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com