GADKARI: ఏపీకీ కేంద్రం గుడ్‌ న్యూస్‌

GADKARI: ఏపీకీ కేంద్రం గుడ్‌ న్యూస్‌
X
రహదారుల అభివృద్ధికి నిధులు.. అమరావతికి రైల్వే లైన్

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితన్ గడ్కరీ ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. రూ.252.42 కోట్ల విలువైన రహదారి పనులకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఇందులో రణస్థలం నుంచి శ్రీకాకుళం వరకూ ఆరులైన్ల ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి, ఆధునికీకరణ గురించి కూడా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు తీరడం సహా రహదారి భద్రత పెరుగుతుందని గడ్కరీ తెలిపారు.


అమరావతికి రైల్వే లైన్

ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం మరో పెద్ద శుభవార్త చెప్పింది. కేంద్ర కేబినెట్ భేటీలో అమరావతి రాజధానికి ఇతర రాష్ట్రాలతో కనెక్టివిటీకి వీలుగా కొత్త రైల్వే రైన్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా కృష్ణా నదిపై సైతం మరో వంతెన నిర్మించనున్నారు. దీంతో అటు హైదరాబాద్, ఇటు బెంగళూరు, చెన్నైకి కనెక్టివిటీ రాబోతోంది. దీంతో కూటమి సర్కార్ పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అమరావతి రాజధానిలో 57 కిలోమీటర్ల పొడవున రూ.2245 కోట్లతో నిర్మించే కొత్త రైల్వే రైన్ కు కేంద్ర కేబినెట్ ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజదాని పరిధిలోకి వచ్చే ఎర్రబాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.ఇందులో భాగంగా కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే వంతెన కూడా నిర్మాణం చేపట్టనున్నారు. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చబోతోంది. వాస్తవానికి ఈ ఏడాది బడ్జెట్ లోనే కేంద్రం గుంటూరు డివిజన్ పరిధిలోని రైల్వే ప్రాజెక్టులకు రూ.1100 కోట్ల మేర కేటాయింపులు చేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 106 కిలోమీటర్ల పొడవున రైల్వే మార్గం ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. ఇందులో ఎర్రబాలెం-నంబూరు మధ్య 55.8 కిలోమీటర్ల మార్గం, అమరావతి-పెదకూరపాడు మధ్య 24.5 కోట్ల మేర, సత్తెనపల్లి-నరసరావుపేట మధ్య 25 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసే రైల్వే మార్గాల డీపీఆర్ కు కూడా ఆమోదించారు. దీనికి రూ.2679 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో ఎర్రబాలెం-నంబూరు మార్గానికి కేబినెట్ మోక్షం లభించింది.

కేంద్రం ఆమోదంపై మంత్రి హర్షం

అమరావతిలో నిర్మాణ పనులకు నవంబర్, డిసెంబర్లో టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రోడ్లు, లేఅవుట్లు, కొండవీటి, పాలవాగు, కెనాల్స్, కరకట్ట రోడ్లకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. సచివాలయ భవనాల నిర్మాణాలకు డిసెంబర్లో, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు వచ్చే ఏడాది JAN నెలాఖరులో టెండర్లు ఖరారు చేస్తామన్నారు. అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం తెలపడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

Tags

Next Story