creative rider: మానవతకు మరో కోణం "సెన్సిటివ్ రైడర్స్"

దేశంలో సరికొత్త మానవీయ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. "సెన్సిటివ్ రైడర్స్" పేరుతో ఈ వినూత్న కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సెన్సిటివ్ రైడర్ కార్యక్రమంలో శబ్దం, ర్యాష్ డ్రైవింగ్, వేగంగా వాహనంగా నడపడం, సడెన్ గా బ్రేక్ వేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. వారి సమస్యను పరిష్కరించేందుకు "సెన్సిటివ్ రైడర్స్" ఓ గొప్ప, వినూత్న కార్యక్రమం అవుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
అసలు ఏమిటి ఈ సెన్సిటివ్ రైడర్స్
సాధారణంగా బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వారు, హృద్రోగులు, కంటి శుక్లాలు, భావోద్వేగాలను నియంత్రించుకోలేని వారు, గర్భవుతులు, ఆపరేషన్ పూర్తయిన వారిని... వైద్యులు వాహనాలు నడపవద్దని సూచిస్తారు. వీరు వాహనం నడిపేటప్పుడు వెనక నుంచి ఎవరైనా గట్టిగా హారన్ కొట్టినా... పెద్ద సౌండ్ చేసిన మళ్లీ హార్ట్ స్ట్రోక్ రావడం కానీ... ఒకేసారి భయపడి వారు కిందపడిపోవడం కానీ జరుగుతుంది. ఇలాంటివి జరగకుండా నియంత్రించాలని "సెన్సిటివ్ రైడర్స్" కార్యక్రమానికి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ శ్రీకారం చుట్టింది. ఈ వినూత్న కార్యక్రమంలో వాహనానికి "s" రైడర్స్ స్టిక్కర్ అంటిస్తారు. ఈ స్టిక్కర్స్ వేసిన దగ్గర గట్టిగా హారన్ కొట్టవద్దని... వేగంగా వాహనాలు నడపవద్దని వాహనదారులకు అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంవల్ల భావోద్వేగ, వైద్య సంబంధిత సమస్యలు లేదా ఆత్మవిశ్వాస లోపం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వ్యక్తులకు రోడ్లపై మరింత భద్రత ఉంటుందని JCI విశాఖ స్టీల్ సిటీ అధ్యక్షురాలు, ‘ది వింగ్స్ ఆఫ్ మైండ్’ స్థాపకురాలు JC రమ్యా అగస్తి వెల్లడించారు.
ప్రారంభించిన కేంద్రమంత్రి
"సెన్సిటివ్ రైడర్స్" ప్రచారంలో భాగంగా ప్రత్యేక గుర్తింపు చిహ్నాన్ని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇతర డ్రైవర్లు... ఈ రైడర్స్ పట్ల మరింత జాగ్రత్తగా, ఓర్పుతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి వెల్లడించారు. సెన్సిటివ్ రైడర్స్‌కు విమానాశ్రయాల్లో అనుకూలమైన, మౌలిక వసతులు కల్పించాలని... JCI విశాఖ స్టీల్ సిటీ అధ్యక్షురాలు JC రమ్యా అగస్తి కేంద్రమంత్రిని కోరారు. ఇది వారిలో ప్రయాణ ఆందోళన తగ్గించి, మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు దోహదపడుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి #SensitiveRiders అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా సోషల్ మీడియాలో విస్తృత క్యాంపెయిన్ కల్పిస్తారు. సహనంతో కూడిన సమాజ నిర్మాణం మనందరి బాధ్యతని రమ్యా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com