ఏపీ సర్కార్‌పై కేంద్రం కనకవర్షం

గడ్డుకాలంలో ఉన్న ఏపీ సర్కార్‌పై కేంద్రం కనకవర్షం కురిపించింది. ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న జగన్ ప్రభుత్వానికి.. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటి రెవెన్యూలోటు కింద 10వేల 460.87 కోట్లు ఇచ్చింది. ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద ఈ మొత్తాన్ని మంజూరు చేసింది. నిధుల్ని వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఈ రెవెన్యూ లోటు నిధుల కోసం 2014-15 నుంచి 2018-19 వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినా, ప్రధానిని కలిసి విన్నవించినా ఫలితం లేకపోయింది.
ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్లు కేంద్రం వ్యవహరించింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ కూడా ఈ నిధుల విషయమై ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఎట్టకేలకు ప్రధాని కార్యాలయం ఆమోదంతో నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి ఏపీకి ఏదైనా నిధులిచ్చినా విడతల వారీగా అందించేవారు. ఒకే దఫా ఇంత పెద్దమొత్తంలో నిధులివ్వడమనేది మునుపెన్నడూ లేదు. ఇక అదీ ఎన్నికల ఏడాదిలో రావడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com