ఛలో అంతర్వేది కార్యక్రమాన్ని విరమించుకున్నట్లు ప్రకటించిన బీజేపీ,జనసేన

ఛలో అంతర్వేది కార్యక్రమాన్ని విరమించుకున్నట్లు ప్రకటించిన బీజేపీ,జనసేన

అంతర్వేది రథం దగ్ధం ఘటన ఏపీలో పెను దుమారమే రేపుతోంది.. రాజకీయమంతా ఈ రథం చుట్టూనే తిరుగుతోంది. ఘటన జరిగి ఇప్పటికే ఆరు రోజులు కావడం..అటు విపక్షాలు, హిందూధార్మిక సంఘాలు ఆందోళనలతో హోరెత్తిస్తుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో కేంద్ర హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ పంపింది. దర్యాప్తును సీబీఐకి అప్పగించే విషయమై శుక్రవారం ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.

గత శనివారం అర్ధరాత్రి దాటాక రథం దగ్ధమైంది. సుమారు 40 అడుగులు ఉన్న ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. అలాంటి రథం దగ్ధమవడంపై రాజకీయ పార్టీలు సహా హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రథం దగ్ధం వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ నిర్ణయంతో శుక్రవారం పిలుపునిచ్చిన ఛలో అంతర్వేది కార్యక్రమాన్ని విరమించుకున్నట్లు బీజేపీ, జనసేన ప్రకటించాయి. తమ ఆందోళనలకు ఉలిక్కిపడిన సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించిందని..ఇది కచ్చితంగా హిందువుల విజయమేనని ప్రకటించింది బీజేపీ.. అటు అంతర్వేదిలో 37 మందిని అరెస్టు చేసినందుకు నిరసనగా కలెక్టరేట్, సబ్‌ డివిజన్ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది.

CBI విచారణను స్వాగతించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్యాప్తు... కేవలం అంతర్వేదికే పరిమితం కాకూడదని..పిఠాపురం, కొండబిట్రగుంట ఘటనల్లోనూ నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. అంతర్వేది భూములు అన్యాక్రాంతమైపోతున్నాయని..రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, ధర్మసత్రాల ఆస్తుల గురించి కూడా సీబీఐ ఆరా తీయాలన్నారు. వీటితోపాటు..తిరుమలశ్రీవారి పింక్ డైమండ్ ఎటుపోయిందన్నది కూడా తేల్చాలన్నారు పవన్.. శ్రీవారికి శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన ఆభరణాల గురించి కూడా ఆరా తీయాలన్నారు. భవిష్యత్తులో ఏ మతస్తుల మనోభావాలు దెబ్బతినేలాంటి దుశ్చర్యలు జరగకూడదని జనసేన కోరుకుంటోందన్న పవన్..అంతర్వేదిలో అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు

బీజేపీ నేతల అరెస్టులను నిరసిస్తూ విశాఖ బీజేపీ కార్యాలయంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఆలయాలపై దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న భూములపై వైసీపీ కన్ను పడిందని ఆరోపించారు. సింహాచల దేవస్థానంలో రాత్రికి రాత్రి ఉత్తర్వులు వచ్చేస్తున్నాయని విమర్శించారు.

వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అంతర్వేదిలో రథాన్ని పిచ్చోడు తగలబెట్టారంటారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అటు అంతర్వేదిలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.. 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అనుమతి లేదని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story