Chandra Babu: పార్టీ మీడియా కో-ఆర్డినేటర్ నరేంద్ర అరెస్టుపై డీజీపీకి చంద్రబాబు లేఖ..

Chandra Babu: పార్టీ మీడియా కో-ఆర్డినేటర్ నరేంద్ర అరెస్టుపై డీజీపీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా సీఐడీ పోలీసులు వ్యవహరించారని..నరేంద్రను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు ఏడుగురు రాత్రి సమయంలో నేమ్ బ్యాడ్జ్‌లు లేకుండా వచ్చి నరేంద్రను తీసుకెళ్లారని లేఖలో వివరించారు చంద్రబాబు.
ఆరోగ్య సమస్యలు ఉన్న నరేంద్రకు ఏదైనా జరిగితే పోలీసు శాఖదే పూర్తి బాధ్యత అన్నారు చంద్రబాబు. ప్రతిపక్ష టీడీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేయడంలో సీఐడీ నిమగ్నమైందన్నారు చంద్రబాబు. ఇదే కేసులో అంకబాబును అరెస్టు చేసినందుకు కోర్టు సీఐడీ పోలీసులకు షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా రాత్రి సమయంలో నరేంద్రను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటన్నారు. టీడీపీ ఆఫీసుపై వైసీపీ దాడి చేసి ఏడాది గడిచినా పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. వైసీపీ ప్రతీకార రాజకీయాలకు సీఐడీ సహకారం విస్మయం కలిగిస్తోందన్నారు చంద్రబాబు. అధికార పార్టీ ప్రయోజనాల కోసం సీఐడీ దిగజారడం బాధాకరమన్నారు చంద్రబాబు. దారపనేని నరేంద్రను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని.. భవిష్యత్తులో ఇలాంటి అక్రమ అరెస్టులు జరగకుండా చూడాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
మరోవైపు.. తన భర్త నరేంద్ర అక్రమ అరెస్టుపై హైకోర్టు సీజేకి లేఖ రాశారు సౌభాగ్యం. బుధవారం అర్ధరాత్రి ఏడుగురు గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను అక్రమంగా తీసుకెళ్లారని లేఖలో వివరించారు సౌభాగ్యం. బలవంతంగా ఎందుకు తీసుకెళ్తున్నారని అడగగా..తాము సీఐడీ పోలీసులమని చెప్పారన్నారు.చేతిరాతతో రాసిన లేఖపై తన సంతకం తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు.
అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న కొంత మంది పోలీసులు తన భర్తను కిడ్నాప్ చేశారని ఆరోపించారు సౌభాగ్యం. తన భర్త చేసిన తప్పేంటో...41-A కింద నోటీసు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సీఐడీ పోలీసులు ఎందుకు పాటించలేదన్నారు. అర్ధరాత్రులు ఎవరి ఇంటిలోకైనా చొరబడే అధికారం పోలీసులకు ఉందా అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను పోలీసులు ఉల్లంఘించారని..తన భర్తకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యత అన్నారు. తన భర్తను అక్రమంగా కిడ్నాప్ చేసిన సీఐడీ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com