Chandra Babu Naidu: టీడీపీ క్యాడర్‌లో జోష్ పెంచుతున్న అధినేత..

Chandra Babu: టీడీపీ అధినేత చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తూ టీడీపీ క్యాడర్‌లో జోష్ పెంచుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా జనసందోహమే కన్పించింది. రోడ్ షోలు, సభలు జనసునామీని తలపించాయి. తాజాగా నేటి నుంచి నెల్లూరు జిల్లాలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇప్పటికే కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా మొత్తం చంద్రబాబు ఫ్లెక్సీలు, టీడీపీ జెండాలతో నింపేశారు. నెల్లూరు జిల్లాను పసుపు మయంగా మార్చేశారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ 28న కందుకూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సింగరాయకొండ బైపాస్ వద్ద అధినేతకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది.
సాయంత్రం 4 గంటలకు దివి కొండయ్య చౌదరి విగ్రహం వద్దకు చేరుకుంటారు. నాలుగున్నర గంటలకు వెంకట నారాయణ నగర్ పరిశీలన, వ్యాపారులతో మాటామంతి నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఎన్టీఆర్ కూడలి దగ్గర బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. అక్కడి నుంచి ఆలా వారి కల్యాణ మండపంలో బస చేయనున్నారు చంద్రబాబు.
ఇక రేపు కందుకూరులో పొగాకు రైతులతో ముఖాముఖీ నిర్వహించడంతో పాటు.. కావలిలో రోడ్‌షో నిర్వహిస్తారు. ఎల్లుండి కోవూరులో పర్యటించనున్నారు. టీడీపీ అధినేత పర్యటన విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు ఇప్పటికే సిద్ధమయ్యారు. అధినేత రాక నేపథ్యంలో కందుకూరు రోడ్లన్నీ టీడీపీ జెండాలతో కళకళలాడుతున్నాయి.
దాదాపు ఏడాది తర్వాత జిల్లాకు వస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. బహిరంగ సభలు, రోడ్‌షోలతో పాటు వివిధ వర్గాలతో మమేకమయ్యేలా కార్యాచరణను టీడీపీ నేతలు రూపొందించారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు సమాయత్తమయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com