Chandra Babu : ఆ నేతలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి చంద్రబాబు లేఖ

Chandra Babu : డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.. నెల్లూరు జిల్లా కావలిలో దళితుడు కరుణాకర్ ఆత్మహత్య ఘటనకు సంబంధించి లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు.. కరుణాకర్ ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు చంద్రబాబు.. ఏపీలో శాంతిభద్రతలు దుర్భరమైన స్థితిలో ఉన్నాయని.. బలహీన వర్గాలు, దళితులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.. కావలిలో కరుణాకర్ ఆత్మహత్య రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమన్నారు.
కరుణాకర్ ముసునూరులోని రెండు చేపల చెరువులను సబ్ లీజుకు తీసుకుని భారీగా పెట్టుబడి పెట్టారని.. వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి చెరువుల్లో చేపలు పట్టకుండా అడ్డంకులు సృష్టించి కరుణాకర్‌ను వేధించారని లేఖలో పేర్కొన్నారు.. వైసీపీ నేతల వేధింపులు తాళలేక కరుణాకర్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని చంద్రబాబు ఆరోపించారు.
నిందితుల్లో ఒకరైన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి శ్రీశైల దేవస్థానం బోర్డులో ఉన్నారని లేఖలో ప్రస్తావించారు. దళితులపై దాడుల విషయంలో మూడేళ్లలో కఠిన చర్యలు లేకపోవడం వల్లే నిందితులు బరితెగిస్తున్నారని మండిపడ్డారు.. పోలీసుల సరైన, తక్షణ చర్యల ద్వారా మాత్రమే దళితులకు రక్షణ దొరుకుతుందని.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com