CBN: 2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పూర్తి చేస్తాం

CBN: 2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పూర్తి చేస్తాం
X
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ.... బాధ్యత రామ్మోహన్‌ నాయుడుదేనన్న సీఎం

భోగాపురం విమానాశ్రయాన్ని 2026 నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విమానాశ్రయాన్ని పూర్తి చేసే బాధ్యత విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు తీసుకోవాలని... ఎప్పటికప్పడు సమీక్ష నిర్వహించాలని సూచించారు. హెలికాప్టర్ ద్వారా విమానాశ్రయం ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ... ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం కీలకమన్నారు. ఈ ప్రాంతానికి భోగాపురం గ్రోత్ ఇంజిన్‌గా పని చేస్తుందన్నారు. విమానాశ్రయం పూర్తయితే ఈ ప్రాంతం ఎకనమిక్ హబ్‌గా మారుతుందన్నారు. చుట్టుపక్కల ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.

భోగాపురం వరకు బీచ్ రోడ్డు నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. పారిశ్రామిక ప్రాంతంగా ఎదగడానికి భోగాపురంకు మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయ రహదారి నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీని పెంచాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల ఎన్నో అంశాలు మళ్లీ మొదటికి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ప్రారంభంలోనే 48 లక్షల మంది ప్రయాణికులతో రన్ అయ్యే పరిస్థితులు ఉంటాయన్నారు. భోగాపురం విమానాశ్రయానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనుమతులు వచ్చాయన్నారు.

చంద్రబాబుకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహననాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్‌, గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు చంద్రబాబు ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఎయిర్‌పోర్టు పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష జరిపారు. గతంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోక్‌ గజపతిరాజు పలు సలహాలు, సూచనలు అందించారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ఎయిర్‌పోర్టును 2026 జూన్‌ 30నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెప్పారని, అంతకంటే ముందుగానే పూర్తిచేయాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఫేజ్‌-1లో భాగంగా భోగాపురం వరకు బీచ్‌రోడ్డు, ఫేజ్‌-2లో మరో 50 కిలోమీటర్లతో శ్రీకాకుళం, ఫేజ్‌-3లో మూలపేట వరకు రోడ్డు పనులు పూర్తి చేస్తామన్నారు.

2015లోనే ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామని చంద్రబాబు వివరించారు. 2016 అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులు ఇచ్చిందన్నారు. రైతుల నుంచి 2,700 ఎకరాలు సేకరించామన్నారు. అన్ని సజావుగా జరిగినట్టయితే 2023 నాటికే ఈ ఎయిర్‌పోర్టు వినియోగంలోకి రావల్సి ఉందన్నారు.

Tags

Next Story