CBN: బాధితుల కష్టాలు... చంద్రబాబు కంట కన్నీళ్లు

CBN: బాధితుల కష్టాలు... చంద్రబాబు కంట కన్నీళ్లు
ప్రకృతి మిగిల్చిన విపత్తును చూసి కంటతడి పెట్టుకున్న చంద్రబాబు... పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరిక

ముంపు బాధితుల కష్టాలు వింటూ చంద్రబాబు చలించిపోయారు. ప్రకృతి మిగిల్చిన విపత్తును చూసి కంటతడి పెట్టుకున్నారు. బుడమేరు వరద తీవ్రతను చూసి ఆవేదనకు గురయ్యారు. బాధితుల కష్టాలు వింటూ అయ్యో పాపమని కళ్లు చెమర్చారు. విజయవాడ, గన్నవరం నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో బుడమేరు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు.. సహాయచర్యల్లో వేగం పెంచాలని, గండ్లను వేగంగా పూడ్చాలని అధికారుల్ని ఆదేశించారు. పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ వరద వచ్చినా విజయవాడలోకి నీరు రాకుండా ఆధునికీకరణ పనులు చేపడతామని స్పష్టంచేశారు. ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. బుడమేరు నీరు నగరంలోకి రాకుండా కృష్ణా, కొల్లేరులో కలిసేలా చూస్తామని, కొల్లేరు ఆక్రమణలపైనా దృష్టిసారిస్తామని వెల్లడించారు. శివారు ప్రాంతాల్లో నిర్వహణ సక్రమంగా ఉంటే నగరంలో ఇంత పెద్దస్థాయిలో నీరు నిలిచేది కాదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడి దెబ్బతిన్న పంటల వివరాల్ని తెలుసుకున్నారు.

బుడమేరు వాగు ఆధునికీకరణ కోసం పనులు ప్రారంభిస్తే.. 2019లో జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని చంద్రబాబు తెలిపారు. 15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా తట్టుకునేలా ప్రకాశం బ్యారేజీని మరింత పటిష్టపరచాలని వెల్లడించారు.. కృష్ణా నదీ కరకట్టలను మరింత బలపరిచేలా చర్యలు తీసుకోవాలి. బుడమేరు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగుతుందని ప్రకటించారు. ఇంతటి జల ప్రళయం సంభవించినా మృతులు సంఖ్యని తగ్గించగలిగామని చంద్రబాబు వెల్లడించారు. ఐఏఎస్ అధికారులకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించడం దేశంలోనే తొలిసారని అని అభినందించారు.. వరద సాయంపై బాధితులు సంతృప్తితో ఉన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు.

చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి రహదారి మార్గంలో సీఎం.. విజయవాడ గ్రామీణ ప్రాంతమైన ఎనికేపాడు చేరుకున్నారు. అక్కడి నుంచి చిన్న మట్టిరోడ్డుపై ప్రయాణించి.. పొలాల్ని ముంచెత్తిన రైవస్‌ కాలువ, ఏలూరు కాలువల్ని పంటుపై దాటారు. అవతలి వైపునకు చేరుకొని బుడమేరు ముంపు ప్రాంతాన్ని, గండ్లను పరిశీలించారు. గండ్లు పూడ్చే పనులపై అధికారులతో పంటు మీదే సమీక్షించారు. మ్యాపుల్ని పరిశీలిస్తూ... బుడమేరు ప్రవాహ తీరు, ఎన్ని గండ్లు పడ్డాయి, వాటిని పూడ్చడానికి ఎంత సమయం పడుతుంది? శాశ్వత మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలపై పలు ప్రశ్నలు సంధించారు. వారికి పలు సూచనలు చేశారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో వరద రాలేదని, సర్వం కోల్పోయామని చంద్రబాబు ముందు పలువురు రైతులు, మహిళలు, వృద్ధులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారికి ధైర్యం చెప్పిన సీఎం... ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Tags

Next Story