దుర్గగుడి రథంలో సింహాలు ఎలా మాయమయ్యాయి?: చంద్రబాబు

దుర్గగుడి రథంలో సింహాలు ఎలా మాయమయ్యాయని విపక్షనేత చంద్రబాబు ప్రశ్నించారు. సింహాల మాయంపై పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదని అన్నారు. కొంతకాలంగా ఆలయాల్లో సంప్రదాయాల్ని దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో 80కి పైగా ఘటనలు జరిగాయని చంద్రబాబు తెలిపారు. అన్యమతస్తులు తిరుమల దర్శానికి వెళ్తే.... డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని, కానీ జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే దర్శనం చేసుకున్నారని తప్పుబట్టారు. అయోధ్య శ్రీరామ మందిర శంకుస్థాపనను ఎస్వీబీసీలో ప్రసారం చేయకపోవడమేంటని నిలదీశారు. ఆలయాలపై దాడుల్ని ప్రభుత్వం మొదట్లోనే సీరియస్‌గా ఉంటే... వరుస ఘటనలు జరిగేవి కావని చంద్రబాబు అన్నారు.
పాలకులు అన్ని మతాల్ని సమానంగా చూడాలని చంద్రబాబు అన్నారు. మనోభావాల్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహించబోమని స్పష్టంచేశారు. రాజకీయాలకు అతీతంగా సంప్రదాయాల్ని గౌరవించాలని సూచించారు. మత సామరస్యం చాలా సున్నితమైన అంశం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మతంపై దాడులు జరిగినప్పుడు కఠినంగా వ్యవహరించాలని అన్నారు. ఆలయాల్లో దాడులు చూస్తుంటే... రాష్ట్రంలో ప్రభుత్వం, సీఎం, మంత్రులు ఉన్నారా? అనే సందేహం కలుగుతోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజలు తిరగబడితే పాలకులు పారిపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com