Chandrababu: నేటి నుంచి చంద్రబాబు ‘ప్రజాగళం’ ప్రచారం..

పొత్తుల ఖరారు, సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికతో తీరిక లేకుండా గడిపిన చంద్రబాబునేటి నుంచి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. ఎన్నికలకు 50 రోజులే సమయం ఉండటంతో ప్రచార వేగం పెంచనున్నారు. ప్రజాగళం పేరిట రోజుకు రెండు నుంచి మూడు నియోజకవర్గాలు చుట్టు వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. సూపర్‌సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే గాకా...ప్రజాకర్షణ పథకాలను ప్రకటించనున్నారు. నేడు పలమనేరు నియోజకవర్గం నుంచి ఆయన పర్యటనలు ప్రారంభం కానున్నాయి.
ప్రజాగళం పేరుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోనున్నారు. ఇప్పటికే బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ రా కదలి రా పేరిట రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహించిన చంద్రబాబు నేటి నుంచి మలివిడత ప్రచారం ప్రారంభించనున్నారు. తొలిరోజు పలమనేరుతో పాటు పుత్తూరు, మదనపల్లెల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది. కుప్పం నుంచి నేరుగా పలమనేరు చేరుకోనున్న చంద్రబాబు..తొలి బహిరంగ సభలో మాట్లాడుతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన పుత్తూరు చేరుకుని రోడ్‌షో, బహిరంగసభలో పాల్గొంటారు. పుత్తూరు నుంచి హెలికాప్టర్‌లో మదనపల్లె చేరుకుంటారు. అక్కడ బహిరంగసభలో ప్రసంగిస్తారు.
ప్రజాగళం తొలివిడత షెడ్యూల్ ఈనెల 31 వరకు సిద్ధం చేశారు. 28న రాప్తాడు, శింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటించనున్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టో పథకాలకు అదనంగా, ఫించన్ 4వేలు రూపాయలు ఇస్తామని అధినేత ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన 60రోజుల్లోనే మెగా డీఎస్సీ దస్త్రం పై సంతకం చేస్తానని హామీలు గుప్పించారు. తాజా ప్రజాగళం సభల్లోనూ మరిన్ని హామీలు ఇచ్చే దిశగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
అటు కూటమిలోని మిగిలిన పార్టీలు సైతం ప్రచారం ముమ్మరం చేయనున్నాయి. జనసేనాని పవన్‌కల్యాణ్ ఈ నెల 30నుంచి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టనున్నారు. పిఠాపురం నుంచే పవన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com