సత్తార్‌ ఆత్మహత్యాయత్నం ఘటన సభ్య సమాజానికే తలవంపులు : చంద్రబాబు

సత్తార్‌ ఆత్మహత్యాయత్నం ఘటన సభ్య సమాజానికే తలవంపులు : చంద్రబాబు
రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాజమండ్రిలో సత్తార్‌ ఆత్మహత్యాయత్నం ఘటన సభ్య సమాజానికే తలవంపులు అన్నారు..

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాజమండ్రిలో సత్తార్‌ ఆత్మహత్యాయత్నం ఘటన సభ్య సమాజానికే తలవంపులు అన్నారు. పదేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీ నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా.. న్యాయం అడిగిన బాధిత కుటుంబాన్నే వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. మహిళలపై అసభ్యంగా వీడియోలు తీయడం కంటే నీచం మరొకటి లేదన్నారు.. అటు వైసీపీ వేధింపులు, ఇటు పోలీసుల వేధింపులతో సత్తార్‌ ఆత్మహత్యాయత్నం చేశాడన్నారు.. సత్తార్‌ ఫిర్యాదుపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే పురుగులమందు తాగేవాడా అని నిలదీశారు.. సత్తార్‌ ఆత్మహత్యాయత్నానికి ప్రధాన దోషులు వైసీపీ, స్థానిక పోలీసులేనని చంద్రబాబు ఆరోపించారు.

పార్టీ సీనియర్‌ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు అనేక అంశాలపై వారితో మాట్లాడారు.. రాష్ట్రంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు ఆగడం లేదన్నారు.. జంగారెడ్డి గూడెంలో అభిలాష్‌ అనే యువకుడికి శిరోముండనం ఘటనను సమావేశంలో ప్రస్తావించారు.. ఇది కిరాతక చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. 30 వేల రూపాయల కోసం శిరోముండనం చేయడం నీచమన్నారు.. మూడు నెలల్లో మూడు జిల్లాల్లో ముగ్గురికి శిరోముండనాలు వైసీపీ దమనకాండకు పరాకాష్ట అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వర ప్రసాద్‌, విశాఖలో శ్రీకాంత్‌, జంగారెడ్డి గూడెంలో అభిలాష్‌ శిరోముండనం ఘటనలు వైసీపీ ప్రభుత్వానికి సిగ్గు చేటన్నారు.. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా దళితులపై ఈ దమనకాండ జరుగుతోందా అని ప్రశ్నించారు.. శిరోముండనం బాధితులు మొదటి ఇద్దరు దళితులు కాగా మూడో శిరోముండనం బాధితుడు బీసీ అన్నారు.. బడుగు, బలహీన వర్గాలపై వైసీపీ దమనకాండకు ఇవే నిదర్శమని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.

ప్రజా సమస్యలపై పోరాడే టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహరీ కూల్చివేత అంశాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించారు.. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు సబ్బం హరి ఇంటి ప్రహరీ కూల్చేశారన్నారు.. విజయవాడలో పట్టాభి కారు ధ్వంసం, గురజాలలో టీడీపీ నాయకుడు శ్రీనివాసరావు బొప్పాయి తోట ధ్వంసం, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డిపై వేధింపులు, టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి జవహర్‌పై కోవిడ్ నిబంధనల కేసు పెట్టడం ప్రభుత్వ ప్రత్యక్ష కక్ష సాధింపేనన్నారు చంద్రబాబు. రోడ్లపై డ్యాన్సులు వేసిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఊరేగింపులు చేసిన వాళ్లపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు.

ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో పార్టీలను చూశామని.. కానీ ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, పార్టీని చూడలేదని చంద్రబాబు అన్నారు.. దుర్మార్గులతో పోరాటం చేస్తున్నామని, వైసీపీపై పోరాటంలో అనుక్షణం అప్రమత్తత అవసరమని పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో పోలీసుల పనితీరుపై న్యాయస్థానాలు ఆగ్రహించాయని, అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు.. ఏపీ చరిత్రలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు.. ఇది సమాజానికి మంచిది కాదన్నారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా పార్టీలకతీతంగా కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నారు.. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో లక్ష్మీనరసింహస్వామి విగ్రహం ధ్వంసం, తాజాగా ఆధోనిలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం, నరసరావుపేటలో సరస్వతి విగ్రహం ధ్వంసం ఘటనల ద్వారా రాష్ట్రంలో మనుషులకే కాదు.. దేవతలకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story