Chandra Babu : జగన్ గాల్లో తిరిగితే.. వరద సమస్య ఎలా తెలుస్తుంది : చంద్రబాబు

Chandra Babu : ఏపీలో గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో... టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఈనెల 21, 22న వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు. వరద బాధితులకు అండగా నిలవాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అటు... ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి కూడా సాయం అందించేందుకు ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు చేశారు.
వరద బాధితుల్ని ఆదుకోవడంలో వైసీపీ సర్కారు విఫలమైందన్నారు చంద్రబాబు. సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ గాల్లో తిరిగితే ప్రజల వరద ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. పీకల్లోతు వరదల్లో ప్రజలు మునిగి ఉంటే జగన్‌రెడ్డి.. కాలికి బురద అంటకుండా హెలికాఫ్టర్‌లో తిరుగుతున్నారని విమర్శించారు.
వరదలపై ప్రభుత్వానికి ఎలాంటి సన్నద్దత లేదన్నారు. వరద బాధితులకు కనీసం నాలుగు రోజుల పాటు ప్రజలకు భోజనం, నీళ్లు ఇవ్వలేకపోతున్నారంటూ విమర్శించారు. ఇక.... పోలవరం కాఫర్ డ్యామ్ ఎత్తుపై ఇప్పుడు జగన్ సర్కారు కొత్త డ్రామాలు చేస్తోందన్నారు. పోలవరంపై మూడేళ్లుగా ఏంచేశారని నిలదీశారు చంద్రబాబు.
అటు విద్యానిధి స్కీమ్‌లో అంబేద్కర్ పేరును తొలగించి జగన్ పేరు చేర్చటంపై మండిపడ్డారు చంద్రబాబు. జగన్‌రెడ్డి అహంకారానికి ఇది నిదర్శమని విమర్శించారు. టీడీపీ హయాంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీమ్ పేరుతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సాయం అందించినట్లు తెలిపిన చంద్రబాబు.. 15దేశాల్లో పీజీ, ఎంబీబీఎస్ ఉన్నత చదువులకు 15 లక్షల ఆర్థిక సాయం చేసినట్లు వెల్లడించారు.
మూడేళ్లుగా విద్యానిధి పథకాన్ని పట్టించుకోని వైసీపీ సర్కార్...ఏకంగా స్కీమ్ నుంచి అంబేద్కర్ పేరు తీసేయటం అంటే మహానీయుడిని అవమానించటమేన్నారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com