Shyam Death: మనసు కలచివేస్తోందంటోన్న జూ.ఎన్టీఆర్

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. కొత్తపేట మండలం మోడేకుర్రు కడలివారి పాలెంలో శ్యామ్ మణికంఠ రాంప్రసాద్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కాట్రేనికోన మండలం కొప్పిగుంటకు చెందిన మణికంఠ తన అమ్మమ్మ ఇంటి వద్ద శనివారం అనుమానస్పద స్థితిలో ఉరేసుకొని చనిపోయారు. మణికంఠ మృతిపై తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడిది ఆత్మహత్య కాదు హత్య అని బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలిలో ఆనవాళ్లను చూస్తే ఎవరో హత్య చేసినట్లు కనిపిస్తోందని మృతుని బంధువులు చెబుతున్నారు.
శ్యామ్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. శ్యామ్ మరణంలో వైసీపీ నేతల ప్రమేయం ఉందని ట్వీట్ చేశారు. యువకుడి మృతిపై సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అటు నారా లోకేష్ విచారణ వ్యక్తం చేశారు. శ్యామ్ మరణం బాధ కలిగించిదంటూ ట్వీట్ చేశారు. వైసీపీ పాలనలో ఎవరికి రక్షణ లేకుండా పోయిందంటూ మండిపడ్డారు. శ్యామ్ అనుమానాస్పద మృతిపై విచారణ జరపాలని లోకేష్ డిమాండ్ చేశారు. వైసీపీ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో నిష్పక్షపాతమైన విచారణ జరపాలని కోరారు. శ్యామ్ మణికంఠ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పారు.
శ్యామ్ మణికంఠ మృతిపై సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. శ్యామ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలిచివేస్తుందన్నారు. శ్యామ్ మృతిపై ప్రభుత్వం తక్షణమే దర్యాప్తు జరిపించాలని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. శ్యామ్ మణికంఠ అనుమానాస్పద మృతి ఘటనపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని డీఎస్పీ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com