CM Chandrababu: కనీసం ఇద్దరు పిల్లలుంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీ

కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పిస్తూ చట్టం తెస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇకపై ఏ పథకం అమలు చేయాలన్నా కుటుంబ పరిమాణాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జనాభాను పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. జనాభాను ఒకప్పుడు భారం అనే వాళ్లమని, కానీ ఇప్పుడది ఆస్తి వంటిదని చంద్రబాబు పేర్కొన్నారు. ఇదివరకు జనాభా నియంత్రణకు ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్లమన్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేస్తూ గతంలో చట్టం తెచ్చామని, అది అప్పటి పరిస్థితి అన్నారు. కానీ ఇప్పుడు జనాభా కావాలన్నారు. ఇప్పుడు కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీకి అర్హత కల్పిస్తామని తెలిపారు.
ఈ క్రమంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేస్తూ తెచ్చిన చట్టానికి ప్రభుత్వం సవరణ చేయనుంది. 2026 లో రాష్ట్రంలో ఒక జంటకు సగటున 1.51 మంది జన్మిస్తే (టోటల్ ఫెర్టిలిటీ రేట్ – టీఎఫ్ఆర్) .. 2051 నాటికి అది 1.07 తగ్గిపోతుందని అంచనాలు చెబుతున్నాయని, ఇది ప్రమాదకరమన్నారు. ఒక జంటకు సగటున 2.1 మంది పిల్లలు జన్నిస్తేనే జనాభా సక్రమ నిర్వహణ సాధ్యపడుతుందని సీఎం పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com