ACB Court: స్వయంగా తన వాదనలు వినిపించిన చంద్రబాబు

ACB Court:   స్వయంగా తన వాదనలు వినిపించిన చంద్రబాబు
ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్‌ చర్యలా... చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా తన వాదనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరగా.. న్యాయమూర్తి అందుకు అనుమతినిచ్చారు. ఈ క్రమంలో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు... తన అరెస్టు అక్రమని తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని... రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని వివరించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు కేబినేట్‌ తీసుకున్న నిర్ణయమని... ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోడానికి వీల్లేదని అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు 2015-16లోనే బడ్జెట్‌లోనే పొందుపరిచామని... దానిని రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించినట్లు స్పష్టం చేశారు. శాసన సభ ఆమోదించిన బడ్జెట్‌ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరని అన్నారు. 2021 డిసెంబర్‌ 9న నమోదు చేసిన F.I.Rలో కాని రిమాండ్‌ రిపోర్టులో కాని తన పాత్ర ఉందని సీఐడీ ఎక్కడా పేర్కొనలేదని చంద్రబాబు వాదనలు వినిపించారు.


మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబును అరెస్టు చేసి ఏసీబీ కోర్టు ముందు హాజరు పరిచిన సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్టును కోర్టులో దాఖలు చేశారు. స్కిల్ డెవలప్​మెంట్ వ్యవహారంలో చంద్రబాబను ప్రధాన కుట్రదారుగా పేర్కోన్న సీఐడీ ఆయన్ను ఏ37 గానే పేర్కొంటూ రిమాండ్ రిపోర్టు సమర్పించింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంతో పాటు వివిధ అక్రమాల్లో ఆయన పాత్ర ఉందని స్పష్టం చేస్తూ తదుపరి విచారణ కోసం ఆయనకు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వాలని పేర్కోంది. ఈమేరకు సీఐడీలోని ఆర్ధిక నేరాల విభాగం డీఎస్పీ ధనుంజయుడు పేరిట రిమాండ్ రిపోర్టును ఏసీబీ కోర్టుకు సమర్పించింది. ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పేర్కోంది.

డిసెంబరు 9 కంటే ముందు ఈ నేరం జరిగిందని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేంద్రంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ అక్రమాలు జరిగాయని వెల్లడించింది. స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటాగా 371 కోట్ల రూపాయలను చెల్లించారని పేర్కోంది. ఇందులో 279 కోట్ల రూపాయల మేర ప్రజాధనం షెల్ కంపెనీలకు దారిమళ్లాయని పేర్కోంటూ రిమాండ్ రిపోర్టు దాఖలు చేసింది. ఏపీలోని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం అమలు కోసం సీమెన్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్ వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ , మెస్సర్స్ డిజైన్ టెక్ సిస్టమ్స్ లిమిటెడ్ పేరిట ఈ కుంభకోణం జరిగిందని పేర్కోంది.

విచారణ ప్రక్రియ ప్రారంభం అయ్యాక 30మంది న్యాయవాదులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలని, అంతకు మించిఉంటే విచారణ ప్రక్రియ మొదలు కాదని న్యాయమూర్తి సూచించారు. దీంతో కేవలం 30 మంది మాత్రమే ఉండి మిగిలిన వారు కోర్టు బయటకు వచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story