BABU: కోర్టులో సొంతంగా చంద్రబాబు వాదనలు

నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో న్యాయాధికారి హిమబిందు అనుమతితో చంద్రబాబు వాదన వినిపించారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటులో తాను ఎలాంటి తప్పూ చేయలేదని, తన అరెస్టు రాజకీయ ప్రేరేపితమని, వైకాపా ప్రభుత్వం కక్షగట్టి తనను కేసులో ఇరికించిందని వివరించారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున రాష్ట్రప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. సీఐడీ కస్టడీలో ఉన్న చంద్రబాబును ఆదివారం ఉదయం 7 గంటల 49 నిమిషాలకు కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు హాలు కిక్కిరిసి ఉండటంతో తన ఛాంబర్‌లోనే విచారిద్దామని న్యాయాధికారి సూచించారు. ఓపెన్ కోర్టులోనే విచారించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. విచారణ ప్రక్రియ సాఫీగా సాగాలంటే కేసుకు సంబంధించిన వాళ్లే హాల్లో ఉండి, మిగతావారంతా బయటకు వెళ్లిపోవాలని ఆమె ఆదేశించారు. ఉదయం 8 గంటల 15 నిమిషాలకు విచారణ మొదలైంది.
మొదట సుమారు 20 నిమిషాల పాటు చంద్రబాబు తన వాదన వినిపించారు. అంతకుముందు నైపుణ్యాభివృద్ధి కేంద్రాల విషయంలో తన అరెస్టు అక్రమమని చంద్రబాబు వాదించారు. సీఐడీ తనపై మోపిన అభియోగాల్లో కొంచెం కూడా వాస్తవం లేదన్నారు. నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు అత్యాధునిక శిక్షణనిచ్చేందుకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటుచేయాలన్నది అప్పటి ప్రభుత్వం, మంత్రివర్గం తీసుకున్న సమష్టి నిర్ణయమన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదని తెలిపారు. ఆ ప్రాజెక్టుకు చేసిన బడ్జెట్ కేటాయింపుల ప్రతిపాదనలకు శాసనసభ ఆమోదం తెలిపాకే చెల్లింపులు జరిగాయని, అది నేరపూరిత చర్య కిందకు రాదని ఆయన వివరించారు.
chandrababu own arguments in acb courtఆ కేసులో 2021లో నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌లో తన ప్రస్తావన లేదని, ఇప్పుడు తనను ఇరికించేందుకు దురుద్దేశపూర్వకంగా ఎఫ్‌ఐఆర్‌లో పేరు చేర్చారని చంద్రబాబు కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసులు తనను నంద్యాలలో అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, అరెస్టు వారంట్ చూపించారే తప్ప, ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదని చంద్రబాబు కోర్టు దృష్టికి తెచ్చారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షతో బనాయించిన కేసని తెలిపారు. అప్పుడు తప్ప ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు కొనసాగినంత సేపు కోర్టు హాల్లో కూర్చుని ఉన్నారు. చంద్రబాబుకు రిమాండు విధిస్తూ కోర్టు ఉత్తర్వులు వెలువడటంతో ఆయనను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com