నేరాలు-ఘోరాలు చేయడం.. ఎదుటివాళ్లపై రుద్దడం: జగన్ పై బాబు కామెంట్స్

నేరాలు-ఘోరాలు చేయడం.. ఎదుటివాళ్లపై రుద్దడం: జగన్ పై బాబు కామెంట్స్
అవినీతిని ప్రశ్నించాడని పట్టాభిపై హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. మీ అవినీతిని ప్రశ్నిస్తే చంపేస్తారా.. అంటూ ఆగ్రహం

పంచాయితీ ఎన్నికలు 2వ దశ గ్రామాల్లోని టీడీపీ నాయకులతో .. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నామినేషన్ల పురోగతిని అడగి తెలుసుకున్నారు. రెండో దశ నామినేషన్ల గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో... ఈ రోజే అన్ని గ్రామాల్లో నామినేషన్లు వేయాలని సూచించారు. ఇబ్బందులుంటే రేపు సరిదిద్దుకోవచ్చన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నామినేషన్ పేపర్ల నకళ్లను, ఎంక్లోజర్స్‌తో సహా డిపివోకు, జిల్లాకలెక్టర్‌కు, ఎన్నికల సంఘానికి, టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపాలన్నారు.

పిరికిపందలు కాబట్టే వైసిపి నాయకులు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యంగా నామినేషన్లు వేస్తున్న అభ్యర్ధులందరికీ అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని టిడిపి చూస్తుంటే... ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలని వైసీపీ చూస్తోందన్నారు. పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం జగన్ రెడ్డికి ఇష్టంలేదన్నారు. వైసిపి వాళ్లను రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు, తప్పుడు కేసులతో బెదిరించాలని చూస్తున్నారని బాబు అన్నారు. ప్రజలను మోసం చేయడం, రాష్ట్రానికి దగా చేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదన్నారు బాబు.

నేరాలు-ఘోరాలు చేయడం, వాటిని ఎదుటివాళ్లపై రుద్దడం జగన్ దుష్టబుద్ధని అన్నారు బాబు. బాబాయి వివేకానందరెడ్డి హత్యను గుండెపోటుగా చిత్రించడం, తర్వాత టిడిపిపై ఆరోపణలు చేయడం, సిఎం అయ్యాక నిందితుల కొమ్ము కాయడం జగన్ నైజమన్నారు. ప్రతిపక్షంలో సిబిఐ విచారణ అడిగిన జగన్, సీఎం అయ్యాక వద్దని లేఖ ఎందుకు రాశారని బాబు ప్రశ్నించారు. అవినీతిని ప్రశ్నించాడని పట్టాభిపై హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. మీ అవినీతిని ప్రశ్నిస్తే చంపేస్తారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపిలో చట్టం వైసీపీకి చుట్టంగా మారిందా అని ప్రశ్నించారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడిని అరెస్టు చేసినవారు... వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబును ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. వైసీపీ ఉన్మాదులతో కుమ్మక్కై రూల్ ఆఫ్ లా భగ్నం చేసే పోలీసులను, అధికారులను గుర్తుపెట్టుకుంటామన్నారు చంద్రబాబు.

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జగన్ రాబట్టింది గుండుసున్నా అంటూ... చంద్రబాబు ఎద్దేవా చేశారు. పోలవరానికి, అమరావతికి నిధులు లేవన్నారు. తొలి ఏడాది ఆర్ధికలోటు, వెనుకబడిన 7జిల్లాలకు నిధులు, విభజన చట్టంలో అంశాలకు నిధులు తేవడంలో జగన్ విఫలమయ్యారన్నారు. కేసుల మాఫీ కోసం 28మంది వైసిపి ఎంపిలను తాకట్టు పెట్టి.. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారని మండిపడ్డారు బాబు.

Tags

Next Story