వైసీపీ అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయి : చంద్రబాబు

వైసీపీ అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయి : చంద్రబాబు
జగన్‌ను మించిన నాటకాల రాయుడు మరొకరు లేరన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. జగన్‌ నోరు తెరిస్తే అబద్ధాలేనంటూ ధ్వజమెత్తారు..

జగన్‌ను మించిన నాటకాల రాయుడు మరొకరు లేరన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. జగన్‌ నోరు తెరిస్తే అబద్ధాలేనంటూ ధ్వజమెత్తారు.. పదిరోజులకే రాష్ట్రంలో లక్ష కరోనా కేసులు వచ్చాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.. మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరితాళ్లు తగిలించడం హేయమైన చర్యగా చంద్రబాబు అభివర్ణించారు.. 0.25 శాతం అప్పు పరిమితి కోసం 18 లక్షల రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ సీనియర్‌ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు వైసీపీ దుర్మార్గాలను అడ్డుకోవాలని, రైతుల ప్రయోజనాలను పరిరక్షించాలని వారికి సూచించారు.

నాలుగేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీకి టాప్‌ ర్యాంక్‌ వచ్చిందని, టీడీపీ పారిశ్రామిక విధానానికి ఇది గొప్ప రేటింగ్‌ అని అన్నారు.. పారిశ్రామిక వేత్తలను బెదిరించి, వైసీపీ ప్రభుత్వం టెర్రరిజం ద్వారా రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తోందని మండిపడ్డారు.. కియాకు ఇచ్చే రాయితీలు వైసీపీ దృష్టిలో పెనాల్టీలా అని ప్రశ్నించారు.. కియా రావడం వైసీపీకి ఇష్టం లేదన్నారు చంద్రబాబు.. వైసీపీ బెదిరింపుల వల్లే కియాకు చెందిన 17 అగ్జిలరీ యూనిట్లు మరో రాష్ట్రానికి తరలిపోయాయన్నారు.

జగన్‌ సీఎం అయ్యాక ఏపీలో దళితులపై దాడులు జరగని రోజు లేదన్నారు.. దళితు లిళ్లు తగులబెట్టడం, సజీవ దహనానికి యత్నం, శిరోముండనాలు, దళిత బిడ్డలపై గ్యాంగ్‌ రేప్‌లు ఇలా వైసీపీ అకృత్యాలకు లెక్కే లేదన్నారు.. దళితులపై వైసీపీ దమనకాండ గురించి దేశవ్యాప్తంగా ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో వైసీపీ బాధిత దళిత కుటుంబాలకు అండగా నిలబడాలన్నారు..

వైసీపీ అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోవడంపైనా చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు.. వైసీపీ పాలనలో ఆలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో అకృత్యాలు పెరిగిపోయాయన్నారు. ఎక్కడికక్కడ మంత్రుల నిలదీతలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వ పథకాలన్నీ కొత్త సీసాలో పాత సారా వంటివేనని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ పథకాలకు, తండ్రీ కొడుకుల పేర్లు తగిలిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాస్క్‌ పెట్టుకోకపోవడం క్షమించరాని నేరమన్నారు.. ప్రధాని, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం మాస్కులు ధరిస్తుంటే మన రాష్ట్రంలో సీఎం జగన్‌, మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు చంద్రబాబు. వైసీపీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అరాచకాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని పార్టీ నేతలకు సూచించారు. పసుపు చైతన్యం వంద రోజుల కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story