ఏపీలో మూడ్రోజుల పాటు జోరుగా సాగిన కోడి పందాలు!

ఏపీలో మూడ్రోజుల పాటు జోరుగా సాగిన కోడి పందాలు!
అటు పశ్చిమగోదావరి జిల్లాలోనూ మూడ్రోజుల పాటు సందడిగా కోడి పందాలు నిర్వహించారు. పెనుగండ మండలం వడలి, తణుకు మండలం తేతలి గ్రామల్లో కోడి పందాలు జోరుగా కొనసాగాయి.

సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు ఏపీలో జాతరను తలపించేలా కోడి పందాలు నిర్వహించారు. లక్షల్లో నోట్ల కట్టలు చేతులు మారాయి. ప్రతి ఏటా ఉభయగోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున సాగే ఈ క్రీడలు.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ జోరుగా సాగాయి. ఇదంతా ఒకెత్తయితే.. పురుషులతో సమానంగా మహిళలు సైతం కోడి పందాల్లో ఆసక్తి కనబరిచారు. నిడమర్రు మండలం మందలపర్రులో సంప్రదాయ పద్ధతిలో కోడి పందేల్లో పాల్గొన్నారు మహిళలు.

తూర్పుగోదావరి జిల్లాలో మూడ్రోజుల పాటు కోడి పందాలు జోరుగా నిర్వహించారు. కోడి పందాలు, గుండాటలతో పందెం బరులు కోలాహలంగా కనిపించాయి. మూడ్రోజుల్లోనే జిల్లాలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. ముఖ్యంగా కోనసీమలోని ప్రతి గ్రామంలోనూ కోడి పందాల బరులు నిర్వహించారు. కోడి పందాలకు పెట్టింది పేరైన భీమవరంలోనూ కోట్లలో బెట్టింగ్ జరిగింది.

కనీసం అటు వైపుగా కూడా చూడలేదు పోలీసులు. తుని నియోజకవర్గ పరిధిలో దాదాపుగా మేజర్ పంచాయితీల్లోనూ కోడి పందాలు జోరుగా సాగాయి. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని కేశనకుర్రుపాలెం, గుత్తెనదీవి, మురమళ్ల, రాజుపాలెం, పల్లిపాలెం, అన్నంపల్లి, కొత్తలంక, చేయ్యూరు గ్రామాల్లో కోడి పందేలు కొనసాగాయి. అడ్డు అదుపూ లేకుండా లక్షల్లో బెట్టింగ్ కాశారు పందెం రాయుళ్లు.

అటు పశ్చిమగోదావరి జిల్లాలోనూ మూడ్రోజుల పాటు సందడిగా కోడి పందాలు నిర్వహించారు. పెనుగండ మండలం వడలి, తణుకు మండలం తేతలి గ్రామల్లో కోడి పందాలు జోరుగా కొనసాగాయి. బరుల వద్దకు వేలాదిగా ప్రజలు తరలివచ్చి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనే గడిచిన మూడ్రోజుల్లో 200 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది.

గుంటూరు జిల్లాలోనూ యథేచ్ఛగా కోడి పందాలు నిర్వహించారు నిర్వాహకులు. వేమూరు నియోజకవర్గంలో మూడ్రోజులు యథేచ్ఛగా కోడిపందాలు జరిగాయి. భట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ నేతలు కోడి పందాలు నిర్వహించారు. మూడ్రోజుల్లో జిల్లాలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. వీటికి తోడు.. పేకాట, గుండాట, బొమ్మలాట వంటి జూద క్రీడలు జోరుగా నిర్వహించారు. కోడి పందాల శిబిరాల వద్దే మద్యం, నిషేధిత గుట్కా అమ్మకాలతో నిర్వాహకులు అమాయకులను దోచుకునే పనిలో పడ్డారు.

Tags

Next Story