BIRD FLU: తెలుగు రాష్ట్రాలను వణికిస్తోన్న బర్డ్‌ ఫ్లూ

BIRD FLU: తెలుగు రాష్ట్రాలను వణికిస్తోన్న బర్డ్‌ ఫ్లూ
X
భారీగా పడిపోయిన చికెన్ అమ్మకాలు.. ఆందోళన అవసరం లేదన్న అధికారులు

తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. ఏపీలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ వ్యాధి అంతకంతకూ వ్యాప్తి చెందుతోంది. బర్డ్‌ఫ్లూ సోకిన 10 కిలో మీటర్ల పరిధిని సర్వెలెన్స్‌ జోన్‌గా అధికారులు ప్రకటించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అనుమలంకపల్లిలో 10 వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. బుధవారం మరో రెండు వేల కోళ్లు మృతి చెందగా.. కోళ్ల శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపారు. కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతోందనే ప్రచారంతో చికెన్​అమ్మకాలపై ఎఫెక్ట్​ పడింది. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో చికెన్ అమ్మకాలు అమాంతం పడిపోయాయి. కొనుగోలుదారులు లేక షాపులు వెలవెలబోయాయి. హైదరాబాద్​లో రోజుకు 6 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతుండగా.. ఇప్పుడు ఇందులో సగం కూడా అమ్ముడుపోలేదు. అయితే, మాంసం ప్రియులు చికెన్ నుంచి మటన్, చేపల వైపు మొగ్గు చూపడంతో మటన్, చేపల అమ్మకాలు ఊపందుకున్నాయి.

హైదరాబాద్‌లో సగానికి పడిపోయిన చికెన్ సేల్స్

బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. సరిహద్దుల వద్ద పలు ఆంక్షలు విధించింది. అయితే మహానగరం హైదరాబాద్‌పై బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ పడుతోంది. బర్డ్ ఫ్లూ వల్ల హైదరాబాద్‌లో 50 శాతానికి చికెన్ అమ్మకాలు పడిపోయాయి. అలాగే కిలో చికెన్ ధర రూ.150కి పడిపోయింది. దీంతో చికెన్‌ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బర్డ్‌ ఫ్లూపై ఆందోళన వద్దు: మంత్రి అచ్చెన్న

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిన విషయం తెలిసిందే. అయితే, బర్డ్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 40 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్టు సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం అవాస్తవమన్నారు. రాష్ట్రంలో 10 కోట్ల కోళ్లు ఉంటే 5.42 లక్షల కోళ్లు ఈ వ్యాధితో చనిపోయాయని తెలిపారు. ప్రభుత్వపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.

అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

కోళ్లలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించిన ఆయన అనుమానిత చికెన్‌ దుకాణాల్లో తనిఖీలు చేయాలని సూచించారు. బర్డ్‌ఫ్లూ వైరస్‌ మనుషులకూ సోకే అవకాశముండటంతో తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కోళ్లఫారాల వద్ద రక్షణ చర్యలు, వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నట్లు తెలిపారు.

Tags

Next Story