16 Oct 2020 2:10 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ముఖ్యమంత్రి జగన్ లేఖపై...

ముఖ్యమంత్రి జగన్ లేఖపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు

న్యాయమూర్తులపై, న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి..

ముఖ్యమంత్రి జగన్ లేఖపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు
X

న్యాయమూర్తులపై, న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది కచ్చితంగా న్యాయ వ్యవస్థను భయపెట్టే ప్రయత్నమంటూ జగన్ తీరుపై మండిపడుతున్నారు. ఈ అంశంపై సీనియర్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ CJIకి లేఖ రాశారు. ఇలాంటి మోసపూరిత చర్యలకు ఇంకెవరూ పాల్పడకుండా సుప్రీంకోర్టు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని CJI దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్ట్ 9 మంది జడ్జీల ధర్మాసనం అంటే ఫుల్ బెంచ్ వెంటనే సమావేశమై.. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ CJకి అశ్విని కుమార్ ఉపాధ్యాయ తన లేఖలో CJIని కోరారు.

రాజకీయ నాయకుల అవినీతిపై సత్వర విచారణ జరపాలన్న కేసులో అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ పిటిషనర్‌గా ఉన్నారు. దీనిపై విచారణ తర్వాతే ధర్మాసనం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేసుల విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జగన్ తన ఆస్తుల కేసులో దోషిగా తేలతాననే భయంతో న్యాయస్థానాలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా లేఖ రాశారని అశ్విని అన్నారు. 6వ తేదీన జగన్ లేఖ తర్వాత ప్రెస్‌ కాన్ఫరెన్స్ కూడా ఆ కుట్రలో భాగమే అన్నారు. ఇది న్యాయస్థానాలపై ఒత్తిడి తీసుకువచ్చే కుటిల ప్రయత్నమని మండిపడ్డారు. అవినీతి, మనీలాండరింగ్, ఆస్తుల కేసులో విచారణ పూర్తైతే.. జగన్మోహన్ రెడ్డి కనిష్టంగా పది సంవత్సరాలు గరిష్టంగా 30 ఏళ్లు జైలుకి వెళ్లక తప్పదని అన్నారు. తాను వేసిన పిటిషన్‌పై విచారణ తుది దశకు వచ్చిన నేపథ్యంలోనే.. జగన్ మోసపూరిత ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. న్యాయస్థానాలను బెదిరించే ప్రయత్నాల్ని ఎవరూ ఉపేక్షించకూడదని అభిప్రాయపడ్డారు.

అటు సీజేఐకి ఏపీ సీఎం జగన్‌ రాసిన లేఖపై బార్ కౌన్సిల్‌ ఆఫ్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తులపై జగన్ ఆరోపణలను ఖండించింది. జగన్ వైఖరిపై మండిపడుతూ బార్ కౌన్సిల్‌ ఛైర్మన్ మనన్‌ కుమార్‌ మిశ్రా పత్రికాప్రకటన విడుదల చేశారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను తక్కువ చేసేలా జగన్ లేఖ ఉందన్నారు. తన అవసరాలకు అనుగుణంగా జడ్జీలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఇదని వ్యాఖ్యానించారు మనన్‌ కుమార్‌ మిశ్రా. న్యాయమూర్తులపై ఒత్తిళ్లు తెచ్చే ప్రయత్నాలు.. ఇటీవల చాలా జరుగుతున్నాయని అన్నారు. అయితే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలాంటి ప్రయత్నం చేయడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.

జగన్‌ మీడియాకు లేఖ విడుదల చేయడం న్యాయమూర్తులను అవమానపరిచే కుట్రలో భాగమేనని మనన్‌ కుమార్‌ మిశ్రా అన్నారు. ఇది న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి.. భంగం కలిగించడమేనని చెప్పారు. న్యాయమూర్తులు తమపై వచ్చిన ఆరోపణలపై బహిరంగంగా స్పందించలేరని.. అందుకే వ్యవస్థ గౌరవాన్ని కాపాడే బాధ్యతను బార్ కౌన్సిల్‌ ఆఫ్ ఇండియా భుజాలకెత్తుకుందని స్పష్టం మనన్‌ కుమార్‌ మిశ్రా స్పష్టం చేశారు. ఇలాంటి కుట్రల్ని చేధించేందుకు దేశవ్యాప్తంగా న్యాయవాదులు ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

మరోవైపు ఏపీ సీఎం జగన్‌పై సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల అసోసియేషన్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది.. జస్టిస్‌ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ లేఖ రాయడాన్ని అసోసియేషన్‌ ఖండించింది.. జగన్‌ లేఖ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా ఉందంటూ మండిపడింది.

హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలపై ఏపీ సీఎం చేసిన ఫిర్యాదులపై దేశమంతా చర్చిస్తోందని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఒక ప్రణాళికతో కావాలనే దాడి చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ చాలా స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. ఎన్నో నేరాల్లో నిందితుడిగా ఉన్న జగన్ ఇలా మాట్లాడటం అసమంజసంగా ఉందన్నారు. సీఎం జగన్ పై కేసులన్నీ అడ్మిట్ అయితే ఏపీ పరిస్థితి ఏమవుతుందో చూడాలన్నారు. మొత్తంగా సీజేఐకి జగన్‌ రాసిన లేఖ పెను దుమారమే రేపుతోంది.. ఏపీ సీఎంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

  • By kasi
  • 16 Oct 2020 2:10 AM GMT
Next Story