PM Modi: వికసిత్‌ భారత్‌.. వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ మా లక్ష్యం

PM Modi: వికసిత్‌ భారత్‌.. వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ మా లక్ష్యం
ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్న ప్రధాని మోదీ

అవినీతిమయమైన జగన్‌ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అవినీతిలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్న మంత్రులతో జగన్‌ కేబినెట్‌ నిండిపోయిందన్న ఆయన గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. తెలుగుదేశం-జనసేన-భాజపా కూటమికి అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడతామని భరోసా ఇచ్చారు.

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని బొప్పూడిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న నరేంద్ర మోదీ.... జగన్‌ సర్కారు పాలనా తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని, కేంద్రంలో మరోసారి N.D.A ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు మద్దతివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో వైకాపా, కాంగ్రెస్‌ వేర్వేరు కాదని.... రెండూ ఒకే తాను ముక్కలని... ప్రధాని మోదీ అన్నారు.ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ చేస్తున్న కృషిని మోదీ అభినందించారు.ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి వచ్చే ఐదేళ్లు అత్యంత కీలక సమయమని, అందుకోసం N.D.A ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు సాధించి మూడోసారి అధికారం చేపట్టాక.... చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రధాని తెలిపారు. రాముడు, కృష్ణుడు లాంటి పాత్రలతో తెలుగు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్‌ సహా తెలుగుబిడ్డ పి.వి.నరసింహారావును కాంగ్రెస్‌ తీవ్రంగా అవమానించిందని మోదీ అన్నారు. కానీ రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్‌, పీవీని భాజపా ప్రభుత్వం గౌరవించిందని గుర్తుచేశారు.

చంద్రబాబు చేరికతో ఎన్డీఏ మరింత బలపడిందని ప్రధాని మోదీ అన్నారు. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌తోనే ఏపీ లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. పేదల కోసం ఆలోచించేది ఎన్డీఏ ప్రభుత్వమేనన్నారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఎన్డీఏ విధానాలతో పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని ప్రధాని మోదీ తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజల కోసమే పనిచేస్తుందన్నారు. ప్రధాని మోదీ ఆవాస్ యోజన కింద పేదలకు పక్కా ఇళ్లు ఇస్తున్నామన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా కోటి కుటుంబాలకు ఉచితంగా కుళాయి కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏపీలో 1.25 కోటి మందికి వైద్య సదుపాయం అందిస్తున్నామన్నారు. చిన్న, సన్నకారు రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కింద సాయం అందిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story