CHRISTMAS: నారా లోకేశ్‌కు షర్మిల క్రిస్మస్‌ శుభాకాంక్షలు

CHRISTMAS: నారా లోకేశ్‌కు షర్మిల క్రిస్మస్‌ శుభాకాంక్షలు
తెలుగు రాష్ట్రాల్లో వేడుకగా క్రిస్మస్‌ సంబరాలు... శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

లుగుదేశం అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులకు సీఎం జగన్ సోదరి, వైతెపా అధ్యక్షురాలు Y.S. షర్మిల క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ కానుకలు పంపారు. కొత్త ఏడాదిలో నారా కుటుంబానికి దేవుడి ఆశీస్సులు ఉండాలని గ్రీటింగ్ పంపించారు. ఈ మేరకు షర్మిలకు కృతజ్ఞతలు తెలుపుతూ.... లోకేష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అద్భుతమైన కానుకలు పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. షర్మిలకు నారా కుటుంబం తరఫున లోకేష్ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


క్రిస్మస్‌ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌నజీర్‌ శుభాకాంక్షలు తెలిపారు. సద్గుణం, విశ్వాసంతో కూడిన జీవితాన్ని గడపడానికి ఏసుక్రీస్తు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, సామరస్యం కోసం ప్రార్థించాలని ఆకాంక్షించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. సమాజంలోని బాధితుల పక్షాన నిలబడి ప్రేమను పంచడం.. అందరిని సమదృష్టితో చూడటం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఏసు క్రీస్తు ఆచ‌రించిన‌ ప్రేమ‌, క‌రుణ‌, స‌హ‌నం ప్రతీ ఒక్కరిలో పెంపొందాలని లోకేష్ తెలిపారు. క్రిస్మస్ పండ‌గ‌ని ఆనందోత్సాహాల‌తో జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. క్రిస్మస్ వేడుకను ప్రజలంతా కలసికట్టుగా జరుపుకోవాలని.. అందరి జీవితాల్లో సంతోషాలు నింపాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. ఏసు మార్గంలో నడుస్తూ ప్రజలందరి పట్ల కరుణ, ప్రేమతో మెలుగుదామని పిలుపునిచ్చారు.


ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో క్రిస్మస్‌ వేడుకలు ఆదివారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధినేత చంద్రబాబు కేక్ కట్ చేసి పార్టీలోని క్రిస్టియన్ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురం తెదేపా క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్టమస్‌ వేడుకలు జరిగాయి. రాయదుర్గంలోని రాజీవ్ గాంధీ కాలనీలో జీసస్ కాలింగ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో రోగులకు పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డలోని I.V.M.హోంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. యానంలోని గౌతమీ గోదావరి తీరాన ఉన్న భారీ ఏసుక్రీస్తు విగ్రహం వద్ద.. పట్టణంలోని అతి పురాతన రోమన్ క్యాథలిక్ చర్చి వద్ద క్రిస్మస్ సందడి నెలకొంది. రోమన్ క్యాథలిక్ చర్చ్‌ను విద్యుత్ దీపాలతో అలంకరించారు.


తెలంగాణలోనూ రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకల సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. చర్చిలన్నీ విద్యుత్‌దీపాల అలంకరణలతో వెలుగులీనుతున్నాయి. రాత్రి నుంచి ప్రార్థనామందిరాలు ఏసునామస్మరణతో మార్మోగుతున్నాయి. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్రైస్తవ సమాజానికి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన చర్చిలు ప్రత్యేక ప్రార్థనలతో కోలాహాలంగా మారాయి.

Tags

Read MoreRead Less
Next Story