Sriharikota: శ్రీహరి కోటలో వరుస ఆత్మహత్యలు.. నిన్న భర్త.. నేడు భార్య

Sriharikota: భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం షార్‌లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. మొన్న ఒక జవాను చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, నిన్న సీఐఎస్ఎఫ్ ఎస్ఐ వికాస్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న 24 గంటల్లోనే అతని భార్య బలవంతంగా ప్రాణాలు తీసుకుంది.
నర్మద గెస్ట్ హౌస్‌లో వికాస్ సింగ్ భార్య ప్రియాసింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయాన్ని ఉత్తర ప్రదేశ్‌లో ఉంటున్న తమ కుటుంబసభ్యులకు వివరించి కన్నీరు మున్నీరయ్యారు. మంగళవారం పిల్లలను తీసుకుని శ్రీహరికోటకు వచ్చిన ప్రియాసింగ్ భర్త మృతదేహాన్ని చూసి బావురుమన్నారు.
అనంతరం అక్కడే ఉన్న నర్మద గెస్ట్ హౌస్‌లో బంధువులతో కలిసి ఉన్న ప్రియాసింగ్.. బుధవారం తెల్లవారు జామున గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీహరికోట నుంచి సూళ్లూరుపేట సర్వజన ఆస్పత్రికి తరలించారు. భర్తమరణాన్ని తట్టుకోలేకే తనువు చాలించినట్లు తెలుస్తోంది. కానీ అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులకు అమ్మానాన్న ఇద్దరూ లేకుండా పోయారు.
ప్రియాసింగ్, వికాస్ సింగ్ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.. కాగా కుమారుడు ఒకటవ తరగతి, కుమార్తె ఎల్‌కేజీ, మరో చిన్న పాప ఉన్నారు. ఇందులో ఒక కుమార్తె వికలాంగురాలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com