Citizens for Democracy: ఏపీలో జైల్లో ఎందుకు పెడతారో కూడా తెలీదు

Citizens for Democracy: ఏపీలో జైల్లో ఎందుకు పెడతారో కూడా తెలీదు
X
సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసీ సంస్థ సభ్యుల ఆవేదన...సివిల్‌ సర్వీసు అధికారులు ఒత్తిళ్లకు లొంగకూడదని హితవు

సివిల్‌ సర్వీసులో ఉండే అధికారులు తప్పనిసరిగా రూల్‌బుక్‌ను పాటించాలని, రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఉల్లంఘనలకు పాల్పడితే తగిన ఫలితం అనుభవించాల్సి ఉంటుందని సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసీ సంస్థ సభ్యులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు జైల్లో పెడతారో, ఎందుకు వదిలేస్తారో తెలియని దుర్భర పరిస్థితి ఏర్పడిందని సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసీ అధ్యక్షుడు జస్టిస్‌ భవానీప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ఏర్పాటైన... సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఆరంభ సభ విజయవాడలో ఘనంగా జరిగింది. మొఘల్ రాజపురంలోని సిద్దార్థ కళాశాల ఆడిటోరియంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్‌ వీఎస్‌ సంపత్‌ హాజరయ్యారు. స్వేచ్ఛాయుత ఎన్నికలు- ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ’అనే అంశంపై విజయవాడలో సిటిజన్స్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించగా కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్‌ వీఎస్‌ సంపత్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేలా దోహదపడటమే తమ లక్ష్యమని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.


ఎవరో వస్తారని, ఏదో చేస్తారని కాకుండా కలిసికట్టుగా అడుగులు వేద్దామనే ఆలోచనతో సంస్థను ఏర్పాటు చేశామని మాజీ సీఎస్‌ ఎల్‌వీ సుబ్రమణ్యం చెప్పారు. యువతకు బంగారు భవిష్యత్తు కోసం.. వనరుల్ని జాగ్రత్తగా వినియోగించుకునేలా కృషిచేద్దామని సూచించారు. నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికలు- ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు అనే అంశంపై సంస్థ ప్రతినిధులు, అతిథులు ప్రసంగించారు. ఏదో ఒక ప్రాంతంలో వ్యవస్థకు కోపం వస్తే బుల్‌డోజర్‌తో ఇల్లు కూలగొట్టేస్తారు.. నోటీసు, విచారణ, ఉత్తర్వులు ఏమీ ఉండవని... సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసీ అధ్యక్షుడు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జి. భవానీప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

తొలితరం ప్రజాప్రతినిధుల ఆదర్శాలతో ప్రజాస్వామ్య ప్రయాణం మొదలైందని తెలిపారు. పాలనా వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోవడం, అవినీతి, ఎన్నికల వ్యవస్థలో లోపాల వల్ల వారి ఆదర్శాలు, ఆకాంక్షలు నెరవడం లేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో పాలనా వ్యవస్థలు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుత, నిస్పాక్షిక ఎన్నికలు జరగడం ముఖ్యమని తెలిపారు. ఎన్నికైన ఏ ప్రభుత్వమైనా ప్రజల హక్కులకు, సంపదకు కాపలాదారు మాత్రమేనని... మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అన్నారు. ప్రజల నెత్తిమీద కూర్చొని స్వారీచేస్తామంటే కుదరదని స్పష్టంచేశారు. రాగద్వేషాలతో పరిపాలన చేస్తే న్యాయస్థానాలు ఉపేక్షించవన్నారు. రాష్ట్రంలో సర్పంచులంతా ఆందోళన బాటలో ఉన్నారని... వాలంటీర్‌ వ్యవస్థ కారణంగా.. నిధులు, విధులు లేక ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.

Tags

Next Story