CJI: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ ఉండాలి: సీజేఐ

భారత రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు విజయవంతంగా పూర్తయ్యాయని,ఈ కాలంలో అనేక సవరణలు, రిజర్వేషన్లను రాజ్యాంగం అవకాశం కల్పించిందిందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్‌లోనూ చట్టం చేశారని, ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ ఉండాలనేది తన అభిప్రాయమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో మంగళగిరిలో కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం కల్పించిందని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. ‘‘సాంఘిక ఆర్థిక న్యాయ సాధన కోసం రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చేసిన ప్రసంగం.. ప్రతి న్యాయవాదికి కంఠోపాఠం కావాలి. రాజ్యాంగాన్ని అంబేడ్కర్ ఓ స్థిర పత్రంగా చూడలేదు. కాలానుగుణంగా మార్పులు అవసరమనే భావించారు. అంశం ప్రాధాన్యతను బట్టి సవరణ విధానాలను పొందుపరిచారు. కొన్ని అంశాల్లో సవరణ సులభం.. కొన్ని అంశాల్లో చాలా కఠినం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మరుసటి ఏడాదే రిజర్వేషన్ల అంశంపై మొదటి సవరణ చేసుకున్నాం. రాజ్యాంగ సవరణ అంశంపై కేంద్రానికి, సుప్రీంకోర్టుకు మొదట్లో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కేశవానంద భారతి కేసులో రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని సవరించరాదని సుప్రీంకోర్టు చెప్పింది.” అని సీజేఐ గుర్తు చేశారు.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గతేడాది ఏడుగురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలోనూ క్రిమీలేయర్ విధానం ఉండాలన్నది నా అభిప్రాయం. పని ప్రదేశాల్లో మహిళలపై వివక్ష ఉండరాదని విశాఖ కేసు తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కొన్నేళ్లుగా మహిళలు న్యాయ విద్యలో బాగా రాణిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలి’’ అని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు.
రాజ్యాంగం అత్యుత్తమం: చంద్రబాబు
బీఆర్ అంబేడ్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం రూపొందించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. చాయ్‌వాలా దేశానికి ప్రధాని అయ్యారంటే అది మన రాజ్యాంగం వల్లేనని పేర్కొన్నారు. ‘‘ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయి. 2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం ఇప్పుడు నాలుగో ఆర్థిక వ్యవస్థకు చేరాం. వచ్చే ఏడాది భారత్ ప్రపంచంలో మూడో, 2038 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కాబోతోంది. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది లక్ష్యం. ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు న్యాయ వ్యవస్థే దాన్ని గాడిన పెడుతోంది. మీడియా రంగంలోనూ ఇటీవల చాలా మార్పులు వచ్చాయి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ రైటరే.. ప్రతి ఒక్కరూ ఎడిటరే. సామాజిక మాధ్యమాలను వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడం దురదృష్టకరం’’ అని చంద్రబాబు అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

