నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య వర్గపోరు

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య వర్గపోరు నెలకొంది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నియోజకవర్గంలో పాతకక్షలు భగ్గుమన్నాయి. ఏఎస్‌పేట మండలం గుడిపాడు మాజీ ఎంపీటీసీ దేవరాల రత్తయ్యపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. బైక్‌పై ఏఎస్‌పేట నుంచి గుడిపాడుకు వెళ్తుండగా మార్గమధ్యలో కాపు కాసిన ప్రత్యర్థులు.. మాజీ ఎంపీటీసీతో పాటు అనుచరుడిపైనా కర్రలతో ఎటాక్ చేశారు. కొట్టి ముళ్లపొదల్లో పడవేశారు. కొత్తపల్లి వైసీపీ నాయకుడు తిరుపతిరెడ్డికి..రత్తయ్యకు చాలరోజులుగా తగాదాలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామ వాలంటరీ విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ విషయంపై గతంలోనే ఇద్దరిని పిలిచి మంత్రి గౌతమ్‌రెడ్డి నచ్చజెప్పినట్టు సమాచారం. ఆ పాతకక్షలతోనే రత్తయ్యపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. దాడిలో రత్తయ్యకు అతని అనుచరుడికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com