CM: అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. సీఎం సీరియస్

చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం దేవళంపేటలోని అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలకు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మద్దతుపలికారు. ఈ ఘటనపై సీఎంవో కార్యాలయంతో పాటు హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. పూతలపట్టు, నెల్లూరు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేలు సౌతం ఆరా తీశారు. స్థానిక ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకుని నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి డిమాండ్ చేశారు. అంతకు ముందు స్థానికులు వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు. నిందితుల్ని అరెస్ట్ చేయాలంటూ.. నగిరి డీఎస్పీ సయ్యద్ అజీజ్, వెదురుకుప్పం ఎస్సై వెంకటసుబ్బయ్య కాళ్ల మీద పడి వేడుకున్నారు. ఘటనకు కారకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించారు.
చంద్రబాబు సీరియస్
అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న కారణంగా జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విగ్రహానికి ఆనుకుని ఉన్న షెడ్డుకు ఆగంతకులు రాత్రి నిప్పు పెట్టడటంతో అంబేద్కర్ విగ్రహానికి నష్టం జరిగిందని అధికారులు వివరించారు. జాతీయ నేతల విగ్రహాలకు అవమానం జరిగేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారని ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు. ఘనటపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
సతీశ్ నాయుడు అనే స్థానిక నాయకుడికి అంబేద్కర్ విగ్రహం పెట్టడం ఇష్టంలేదని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. సతీశ్ నాయుడే నిప్పు పెట్టించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేయని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com