CM Chandrababu: సాయంత్రం ప్రధానమంత్రితో చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడపనున్నారు. నిన్న సాయంత్రమే చంద్రబాబు హస్తినకు వెళ్లారు. ఈరోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్రమంత్రులను చంద్రబాబు కలువనున్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు చెబుతూనే ఇంకా తేలాల్సిన అంశాలపై మాట్లాడనున్నారు. ముఖ్యంగా పోలవరం నిధుల అంశంపై చర్చించనున్నారు. రాష్ట్ర పరిస్థితుల గురించి మరోసారి కేంద్రపెద్దల ముందు వివరించనున్నారు.
అనంతరం సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్‌తో సమావేశంకానున్నారు. తర్వాత రాత్రి 7 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చించనున్నారు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై కూడా మోడీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో అమరావతికి ప్రత్యేక సహాయంగా రూ.15 వేల కోట్లను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్ హయాంలో చేసిన రుణాలను రీ షెడ్యూల్ చేయాలని ఈ సందర్భంగా ప్రధానిని చంద్రబాబు కోరనున్నారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కలిసిన సంగతి విధితమే. ఈ సందర్భంగా ఏపీ ఆర్థిక అంశాలపై కేంద్రమంత్రితో పయ్యావుల కేశవ్ సుదీర్ఘంగా చర్చించారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిలీ విమానాశ్రయంలో చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. పూసపాటి విజయరామ గజపతిరాజు(పీవీజీ రాజు) జీవిత చరిత్ర ఇంగ్లీష్ వెర్షన్ పుస్తకాన్ని చంద్రబాబుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బహూకరించి స్వాగతం పలికారు. అనంతరం సీఎం కారులో కేంద్ర పెద్దలను కలిసేందుకు బయలుదేరారు. అయితే ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ సెక్రటరీ దేబశ్రీ ముఖర్జీని కలిశారు. ఆయనతో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ జి.సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్టు సీఈ కె.నరసింహమూర్తి ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, పెండింగ్ అంశాలపై కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో మంత్రి నిమ్మల చర్చించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com