CBN: కేసుల పురోగతిపై చంద్రబాబు అసహనం..!

CBN: కేసుల పురోగతిపై చంద్రబాబు అసహనం..!
X
తప్పు చేసిన వారికి వంత పాడవద్దని స్పష్టీకరణ... పలు కేసులపై పోలీసు అధికారులతో సమీక్ష

ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన కేసుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కీలకమైన కేసుల్లో అసలు పురోగతి ఎందుకు లేదంటూ సీఐడీ, ఏసీబీ అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ పోలీసింగ్‌ ముగిసిందని గ్రహించాలని... తప్పు చేసిన వ్యక్తులకు వంత పాడే రోజులు పోయాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల పాటు పోలీసు వ్యవస్థ ఒక రాజకీయ పార్టీ కోసం పని చేసిందన్నారు. ఇప్పుడు శాంతిభద్రతల పరిరక్షణ కోసమే పని చేయాలని, అయితే మార్పు ఇంకా కనిపించడం లేదని అన్నారు. మంగళ, బుధవారాల్లో వరుసగా 2 రోజులు రాత్రి పొద్దుపోయాక పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా చంద్రబాబు సమీక్షించారు. సీఐడీ, ఏసీబీతోపాటు ఐదుగురు అత్యున్నత స్థాయి అధికారులతో ఆయన భేటీ అయ్యారు. పోలీసు అధికారులు ఇచ్చిన వివరణలు, సమాధానంపై ఆయన అంతగా సంతృప్తి వ్యక్తం చేయలేదని తెలిసింది. తాజా పరిణామాలు, పరిస్థితుల ఆధారంగా 2 రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం.

పలు కేసుల్లో ఆలస్యంపై చంద్రబాబు ప్రశ్నలు

మద్యం కుంభకోణం కేసులో చర్యల్లో జాప్యంపైనా చంద్రబాబు పోలీసు అధికారులను అడిగి ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో ఫైళ్లు, కంప్యూటర్లు అన్నీ స్వాధీనం చేసుకుని డిజిటల్‌ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయిస్తున్నామని అధికారులు బదులిచ్చారు. పకడ్బందీగా ఆధారాలు సేకరిస్తున్నామని, వీలైనంత త్వరలో కీలక వ్యక్తుల్ని అరెస్టు చేస్తామని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. రేషన్‌ మాఫియాపై సీఎం పలు ప్రశ్నలు వేసినప్పుడు పోలీసు ఉన్నతాధికారులు మౌనంగా ఉన్నట్లు తెలిసింది. రేషన్‌ మాఫియాను వదలొద్దని, ఆధారాలు సేకరించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో జరిగిన దోపిడీపైనా అధికారులు మౌనం వహించినట్లు తెలిసింది. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి మద్యం ఉత్పత్తి, సరఫరా, విక్రయాలు అన్నీ తన చేతిలో పెట్టుకున్నాడని... వేలకోట్లు తాడేపల్లి ప్యాలెస్‌కు చేరాయని.. బాధ్యులెవరో తెలుసన్నారు. వారిని అరెస్టు చేయాలి కదా? అసలు సూత్రధారులను అరెస్టు చేయకపోతే ప్రజలకు ఏమని సమాధానం చెబుతాంమని చంద్రబాబు ప్రశ్నించారు.

బూతుల నోళ్లకు తాళంపై చంద్రబాబు హర్షం

ఐదేళ్ల పాటు ఇష్టారాజ్యంగా బూతులతో సోషల్‌ మీడియా ద్వారా రెచ్చిపోయిన సోషల్‌ సైకోల నోళ్లకు తాళాలు వేయగలిగారని పోలీసుల్ని సీఎం చంద్రబాబు అభినందించారు. ‘వావి వరసలు లేకుండా తల్లి, చెల్లి, ఆడబిడ్డలనే స్పృహ లేకుండా జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేశారు. అటువంటి సైకోలను గడిచిన రెండు వారాల్లో బాగానే కట్టడి చేశారు’ అని సీఎం అన్నారు. సుమారు నాలుగు వేలకు పైగా ఇటువంటి అకౌంట్లను గుర్తించి నిఘా పెట్టామని, సగానికి పైగా క్లోజ్‌ అయ్యాయని డీజీపీ వివరించారు. మిగిలిన వాటిలో వస్తున్న పోస్టులపైనా నిఘా పెట్టి నిరంతరం పరిశీలిస్తున్నామని చెప్పారు.

Tags

Next Story