ఆయనే వెళ్తున్నారా.. ఢిల్లీ పెద్దలు పిలిపించారా..?

ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు. ఆయనే వెళ్తున్నారా.. ఢిల్లీ పెద్దలు పిలిపించారా..? ఇప్పుడిది చర్చనీయాంశమైంది. సీఎం టూర్ అజెండా ఏంటి, ఎవరెవర్ని కలుస్తారనే దానిపై గోప్యత పాటించడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. ప్రధానంగా 3 రాజధానుల అంశం, రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపైనే చర్చిస్తారని తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లే ఆయన రేపు ఉదయాన్నే మళ్లీ తిరుగు ప్రయాణం అవుతున్నారంటే అంత అర్జెంట్‌గా హస్తిన పెద్దల్ని కలిసి వివరణ ఇచ్చుకునే అంశాలు ఏమున్నాయనేది ఆసక్తిరేపుతోంది.
అంతర్వేది సహా పలు ఆలయాల్లో ఘటనలపై కేంద్రానికి BJP నేతల ఫిర్యాదులు చేశారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, టీడీపీ ఎంపీలు ఈ అంశాన్ని లోక్‌సభలో సైతం ప్రస్తావించారు. జాతీయస్థాయిలోనూ ఆలయాలపై దాడుల అంశం చర్చనీయాంశం కావడంతో ఇవాళ అమిత్‌షాతో భేటీలో దీనిపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు, 3 రాజధానుల అంశం కూడా ప్రస్తావనకు వస్తుందా అనే ఊహాగానాలు కూడా తెరపైకి వచ్చాయి. ఇటీవలే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లాను ఎంపీ సుజనా చౌదరి కలిసారు. రాజధానిపై నిర్ణయం కేంద్రానికే ఉంటుందని వివరిస్తూ ఓ వినతిపత్రం ఇచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246, 248 ప్రకారం రాజధానిపై అధికార పరిధి పార్లమెంట్‌కే ఉంటుందని ఆయన అజయ్‌భల్లాకు వివరించారు. టీడీపీ ఎంపీలు కూడా ఇదే అంశంపై హోంశాఖ కార్యదర్శిని కలిసారు. ఈ పరిణామాల నేపథ్యంలో హైకోర్టులో అదనపు అఫిడవిట్‌పై న్యాయసమీక్ష దిశగా కేంద్రం ఆలోచిస్తోందనే వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిణామాలే జగన్ ఢిల్లీ టూర్‌కు కారణం అని ప్రచారం జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com