సీపీఎస్ రద్దుపైమళ్లీ మాట తప్పిన సీఎం జగన్

సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ మళ్లీ మాట తప్పి మడమ తిప్పేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్.. ఉద్యోగులను మరోసారి దగా చేశారు. పాత పింఛను పథకాన్ని పునరుద్ధరిస్తారని ఎదురుచూసిన ఉద్యోగులను నిలువునా మోసం చేశారు. ఓపీఎస్‌ను పునరుద్ధరించలేమని తేల్చిచెప్పేశారు. కేబినెట్ సమావేశంలో సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అమలుకు బిల్లు పెట్టి ఆమోదించాలని నిర్ణయం తీసుకున్నారు. సీపీఎస్ విధానంలో పింఛనుకు గ్యారంటీ లేదని, జీపీఎస్ విధానంలో పింఛనుకు గ్యారంటీ ఉంటుందని ప్రకటిస్తూనే పాత పింఛను విధానం తీసుకురావడం సాధ్యం కాదని తేల్చిచెప్పేసారు. దీంతో పాత పింఛను విధానం ద్వారా పదవీ విరమణ చేసే ఉద్యోగులకు అందే ప్రయోజనాలన్నీ అందజేయలేమని.. ఇక ఉండవని చెప్పకనే చెప్పేశారు.
జగన్ సర్కారు నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మాట నిలబెట్టుకోకపోతే ఆ రాజకీయ నాయకుడు రాజీనామా చేసి వెళ్లిపోవాలని చెప్పిన జగన్... మరి ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు కోరుకునేది జీపీఎస్ కాదని, ఓపీఎస్ మాత్రమేనని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పాత పింఛను పథకానికి, ఈ కొత్త జీపీఎస్‌కు ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయని తెలిపారు. ఓపీఎస్ కింద వచ్చే ప్రయోజనాలన్నీ ఇవ్వలేకనే ఈ జీపీఎస్ పేరుతో మసి పూసి మారేడుకాయ చేస్తున్నారని ఆరోపించారు. జీపీఎస్‌తో ఉద్యోగులకు ఒరిగేదేమి లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు ఎంతో నష్టపోతారని.. జీపీఎస్ విధానాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com