రైతులకోసం దేవునితోనైనా కొట్లాడుతా : ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణలో వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకునే విషయంలో దేవునితోనైనా కొట్లాడుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లతో..

తెలంగాణలో వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకునే విషయంలో దేవునితోనైనా కొట్లాడుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని, స్వరాష్ట్రంలో వ్యవసాయరంగంలో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. పంటల దిగుబడిలో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలిచాడని, రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారిందని పేర్కొన్నారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ నదీజలాలను ఒడిసిపట్టుకొని తెలంగాణ బీళ్లను సస్యశ్యామలం చేస్తున్నామన్నారు. ఈ నెల 6న అపెక్స్ కమిటీ సమావేశం ఉండటంతో ఇరిగేషన్ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
గోదావరి, కృష్ణా నదీ జలాల్లో హక్కుగా వచ్చే ప్రతీ నీటిబొట్టును కూడా వినియోగించుకొని తీరుతామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాన్ని జలవనరులశాఖ ఉన్నతాధికారులతో జరిపిన సమావేశంలో ఖరారు చేశారు.నదీజలాల విషయంలో ఏపీ కావాలనే కయ్యం పెట్టుకుంటోందని, అపెక్స్ సమావేశంలో ధీటైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేస్తామన్నారు..
గతంలో రెండుసార్లు వాయిదా పడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని అక్టోబరు 6న నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై చర్చించనున్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుతోపాటు ఏపీ ఫిర్యాదు చేసిన తెలంగాణ ప్రాజెక్టులు, బోర్డుల అధికారాలు వంటి వాటిపై చర్చించే అవకాశం ఉంది.
అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఆగస్టు 5న నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ భేటీలో పాల్గొనలేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడంతో వాయిదా వేశారు. అనంతరం ఆగస్టు 25న జరపాలనుకున్నప్పటికీ జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు కరోనా సోకడంతో వాయిదా పడింది. మళ్లీ ఈ నెల 6న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు కేంద్రం సమాచారం ఇచ్చింది.