CM RAMESH: సీఎం రమేష్ ఆరోపణల ప్రకంపనలు

కంచె గచ్చిబౌలి భూముల వెనుక బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నారన్న... మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపై సీఎం రమేష్ ఘాటుగా స్పందించారు. భూములు తనఖాకు సహాయం చేసినందుకు సీఎం రమేష్‌కు ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి రూ.1600 కోట్ల రోడ్ల కాంట్రాక్టులు కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సీఎం రమేష్ వార్నింగ్ ఇచ్చాడు. కంచ గచ్చిబౌలిలో పలు కంపెనీలు టెండర్లు వేశాయని... అందులో తనకు ఎటువంటి టెండర్లు రాలేదని సీఎం రమేష్ వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో వేసిన టెండర్లకు అన్ని నిబంధనల ప్రకారం.. రుత్విక్ కంపెనీకి టెండర్ వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. టెండర్ల విషయంలో వాస్తవాలు తెలియకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడని, ఎవరితోనైనా దోస్తానా చేస్తే టెండర్లు ఇస్తారా అని ఎంపీ రమేష్ కేటీఆర్‌ను ప్రశ్నించారు. కేటీఆర్ కవిత సహా బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలోని తన ఇంటికి ఎందుకు వచ్చారో మర్చిపోయారా అని ప్రశ్నించారు. వారిపై వివిధ వ్యవహారాల్లో విచారణలు జరగకుండా చూడాలని కేటీఆర్ అడగడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులపై విచారణలు జరగకుండా చేస్తే.. పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని తనతో చెప్పింది నిజం కాదా అని ఎంపీ రమేష్ ప్రశ్నించారు.
కేటీఆర్ ఏ విధంగా ఎమ్మెల్యే అయ్యారో మర్చిపోయారా? అని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్, టీడీపీ పొత్తు ఉన్నప్పుడు తాను చేసిన మేలు మర్చిపోయావా? అంటూ కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆరోజు కేటీఆర్ 300 ఓట్ల మెజారిటీతో గెలిచారని... అయితే ఆయన ఏ విధంగా గెలిచారనేది తనకు తెలుసునని చెప్పారు. తెలంగాణలో రేపటి రోజున బీజేపీ - టీడీపీ పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్‌కు పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో భయం పెట్టుకుని కాంగ్రెస్, బీజేపీల మధ్య బంధం ఉందని మాట్లాడుతున్నాడని సీఎం రమేష్ విమర్శించారు. ఎక్కడైనా కాంగ్రెస్, బీజేపీల మధ్య బంధం ఉంటుందా?, ఎవరైనా దీనిని నమ్ముతారా? అని ప్రశ్నించారు. కేటీఆర్ మాట్లాడే లాంగ్వేజ్ ఎలా ఉందని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com