REVANTH: బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు

REVANTH: బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు
400 సీట్లు గెలిస్తే రాజ్యాంగ హక్కులు కాలరాస్తారు... ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు

దేశంలో రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎలాగైనా 400సీట్లు గెలిచి రాజ్యాంగ హక్కులను కాలరాసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కార్‌ పదేళ్ల పాలనపై రాష్ట్ర కాంగ్రెస్‌ రూపొందించిన ఛార్జిషీట్‌ను సీఎం విడుదల చేశారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచేందుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.


సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 14స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్‌ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులెస్తోంది. ప్రచారంలో భాగంగా ప్రజాక్షేత్రంలో ఇప్పటికే బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై విరుచుకుపడుతున్న ఆ పార్టీ నాయకత్వం... కేంద్రంలో మోదీసర్కార్‌ పదేళ్ల పాలనపై ఛార్జిషీట్‌ విడుదల చేసింది. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఛార్జిషీట్‌ను విడుదల చేయగా... డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌ సహా ఇతర నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. బీజేపీ నయవంచన పేరుతో రూపొందించిన ఈ ఛార్జిషీట్‌లోవిభజన హామీలు, తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలను ప్రస్తావించారు. GST పేరుతో పేదలను దోచుకున్నారని ఆరోపించిన సీఎం రేవంత్‌రెడ్డి... 60 ఏళ్లు కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులను పదేళ్లలో కార్పోరేటర్లకు కట్టబెట్టారని అగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ సర్కార్‌పై ఛార్జిషీట్‌ విడుదల సందర్భంగా మోదీ సర్కార్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు రద్దు చేయాలన్న RSS అజెండాను అమలు చేసేందుకు మోదీ సర్కార్‌ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్‌లు పెంచుతామని రాహుల్‌గాంధీ ప్రకటించినందున దీనిని అడ్డుకునేందుకు భాజపా కుట్రలు చేస్తోందన్నారు. రిజర్వేషన్లు ఉండాలా... వద్దా... అనే అంశానికి లోక్‌సభ ఎన్నికలు రిఫరెండమని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

దేశంలో అల్లకల్లోలం సృష్టించి అధికారం చేపట్టేందుకు భాజపా యత్నిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. దేశ సంపద, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story